ఈనెల 27న తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల ఏడాది కాబట్టి పలు అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. ఎన్నికలకు సన్నద్ధంగా ఉండేలా కార్యాచరణపై చర్చిస్తామని వివరించారు.
‘మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి. ఈసారి కూడా తెలంగాణపై విజయబావుటా మనదే ఎగరాలి. అందుకోసం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి మంత్రుల వరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అసంతృప్తులను బుజ్జగిస్తూ.. అందరినీ కలుపుకుపోతూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. కార్యకర్తలే మన బలం.. బలగం. అందుకే వారితో సమన్వయం చేసుకుంటూ పోవాలి. ఈనెల 26న ప్రతి డివిజన్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ జరపాలి. ‘ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
మరోవైపు ఏపీలో పరిస్థితులపై కేటీఆర్ స్పందించారు. ‘ప్రభుత్వరంగ సంస్థల సంరక్షణపై ఏపీ ఏం చేస్తోందన్న దానిపై మాకు ఆసక్తి లేదు. ఏపీ ఏం చేస్తుందన్నది కాదు.. కేంద్రం ఏం చేస్తున్నది అన్నది ముఖ్యం. ప్రభుత్వసంస్థలను కాదని.. పాస్కో ఎందుకు? ఉస్కో ఎందుకు? ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.’ అని కేటీఆర్ తెలిపారు.