సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఘటనపై కేసు నమోదు

-

కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ నియామకాల విధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు ప్రజ్వరిల్లగా, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోనూ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ప్రాథమిక అంచనాల మేరకు సుమారు రూ. 7 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. భారీ ఎత్తున పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను చెదరగొట్టడంతో ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. దీంతో పోలీసులు ఆందోళనకారులపై చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే రైల్వే పోలీసులు ఏకంగా 14 సెక్షన్ల కింద ఆందోళనకారులపై కేసు నమోదు చేశారు.

రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారన్న కారణంగా సెక్షన్ 143, 147, 324, 307, 435,427, 448, 336, 332, 341, రెడ్ విత్ 149 తో పాటు, ఇండియన్ రైల్వే యాక్ట్ 150, 151, 152, కింద కేసులు నమోదు చేశారు. రైల్వే ఉద్యోగి రాజ నర్సు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. దాడుల్లో ఎంతమంది పాల్గొన్నారన్నది ఇంకా గుర్తించలేదని తెలిపిన ఎస్పీ.. ఆస్తి నష్టం ఇంకా అంచనా వేయలేదన్నారు. ఇప్పటికే పలువురు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నామని, రైళ్లు రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొనారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version