కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రస్తుతం పెద్ద ఎత్తున ఫేక్ న్యూస్ ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే కొందరు వ్యక్తులు ప్రజలను భయాందోళనలకు గురి చేసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే అలాంటి వారిని ఆయా మాధ్యమాల నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఫేస్‌బుక్, టిక్‌టాక్‌లలో కొందరు వ్యక్తులు ఫేక్ వార్తలను ప్రచారం చేయడమే కాకుండా.. ప్రజలను భయాందోళనలకు గురి చేసే పోస్టులు పెడుతున్నారని.. కనుక అలాంటి యూజర్లను వెంటనే ఆయా యాప్‌ల నుంచి తొలగించాలని.. కేంద్ర ప్రభుత్వం.. ఫేస్‌బుక్, టిక్‌టాక్‌లకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా పట్ల లేని పోని భయాలను కలిగిస్తూ కొందరు పెడుతున్న పోస్టుల వల్ల ప్రజలు తీవ్రమైన భయాందోళనలకు గురవుతున్నారని, దీంతో కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యే అవకాశం ఉందని.. కనుక.. అలాంటి పోస్టులను పెట్టే యూజర్లను ఏమాత్రం ఉపేక్షించకుండా వెంటనే వారిని తొలగించాలని.. ఫేస్‌బుక్, టిక్‌టాక్‌లకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ప్రభుత్వ అధికారి తెలిపారు.
కాగా వాట్సాప్‌లో కరోనాపై ప్రచారం అవుతున్న ఫేక్ వార్తలను కట్టడి చేయాలని ఇప్పటికే కేంద్రం వాట్సాప్‌కు సూచించగా.. వాట్సాప్ చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే యూజర్లు ఇకపై పలు పోస్టులను వాట్సాప్‌లో కేవలం ఒకరికి మాత్రమే ఫార్వార్డ్ చేసుకునే విధంగా వాట్సాప్ మార్పులు చేర్పులు చేసింది. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్, టిక్‌టాక్‌లకు కూడా ఈ విషయంపై కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.