రాజధాని రైతుల ఆందోళనలు 50వ రోజుకి చేరుకున్నాయి. నేటికి 50వ రోజు కావడంతో రాజధాని రైతులు వినూత్న నిరసనలు చేపట్టనున్నారు. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసే వారితో కలిపి నేడు నిరసనలు చేస్తున్నారు. మందడం, తుళ్లూరులో ధర్నా నిర్వహించారు. వెలగపూడిలో 50వ రోజు రిలే దీక్షలు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. `ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏసుప్రభువుపై నమ్మకం ఉంటే.. ఇక్కడే అమరావతిని కొనసాగిస్తానని చెప్పాలని` టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఇరికించారు.
బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజధాని కోసం 39 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల్లేవని జగన్ అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. అమరావతిని శ్మశానం అన్నారని, శ్మశానంలో కూర్చొని పాలించారా? అని ప్రశ్నించారు. రాజధానికి వరదలు వస్తాయని వైసీపీ నేతలు ప్రచారం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.