అసెంబ్లీకి బాబు..అదే ప్లాన్‌తో టీడీపీ?

-

ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడింది. ఈ నెల 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి సమావేశాల్లో వైసీపీ ఊహించని ఎత్తుగడలతో ముందుకొచ్చేలా ఉంది. మూడు రాజధానుల బిల్లుని ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అటు మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతికి మద్ధతుగా పోరాటం చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ సమావేశాలకు చంద్రబాబు హాజరయ్యే అవకాశాలు లేవు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు తన భార్య భువనేశ్వరిని ఉద్దేశించి నీచంగా మాట్లాడారని చెప్పి..చంద్రబాబు ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవ్వను అని, మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలిచాక అసెంబ్లీలోకి అడుగు పెడతానని సవాల్ చేసి అసెంబ్లీ నుంచి బయటకొచ్చి కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలని బహిష్కరించారు గాని..టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం హాజరవుతున్నారు. గత సమావేశాల్లో బాబు లేకుండానే ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కానీ పలు అంశాల్లో నిరసన తెలియజేసి సస్పెండ్ అయ్యారు.

మరి ఇప్పుడు తాజాగా జరగబోయే సమావేశాలకు బాబు హాజరయ్యే ఛాన్స్ లేదు. దీంతో తమ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసి..అసెంబ్లీ సమావేశాలకు పంపించాలని బాబు రెడీ అవుతున్నారు. అలాగే వైసీపీ గనుక మూడు రాజధానుల బిల్లుని తీసుకొస్తే…దాన్ని ఏ విధంగా డిఫెండ్ చేయాలనే అంశాలని జరగబోతే టీడీఎల్పీ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.

ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యేలకు వైసీపీ అవకాశం ఇవ్వకపోతే…అసెంబ్లీకి సమానంగా మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేయాలని బాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పాదయాత్ర ద్వారా జనంలోకి వెళుతున్న అమరావతి ఉద్యమాన్ని సైడ్ చేయడానికి..వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని ఖచ్చితంగా సభలో ప్రస్తావించి..ప్రజలకు మూడు రాజధానుల గురించి సవివరంగా చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే అన్నీ అనుకున్నట్లు జరిగితే న్యాయ పరమైన ఇబ్బందులు రాకుండా..మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీలో ప్రవేశ పెట్టే ఛాన్స్ కూడా ఉంది. చూడాలి మరి ఈ సారి అసెంబ్లీ సమావేశాలు ఎలా నడుస్తాయో.

Read more RELATED
Recommended to you

Exit mobile version