జగన్ ప్రభుత్వాన్ని కూల్చివేయడం ఖాయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదే పదే గళం విప్పుతున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్తితుల్లోనూ వైసీపీని మళ్ళీ అధికారంలోకి రానివ్వమని అంటున్నారు. అయితే టీడీపీతో కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాలని పవన్ భావిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే సింగిల్ గా జనసేనకు..వైసీపీని గద్దే దించే శక్తి లేదు. అయితే జగన్ ప్రభుత్వం…రాను రాను చంద్రబాబు-పవన్ మైత్రిని మరింత బలపడేలా చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.
ప్రతిపక్షాలని అణిచివేయాలనే క్రమంలో..ప్రతిపక్షాలు ఏకమయ్యేలా చేస్తున్నారని చెప్పవచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష టిడిపికి చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇక చంద్రబాబుని ఏ విధంగా టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు..ఆయన్ని నానా రకాలుగా అవమానించడం, బూతులు తిట్టడం చేస్తున్నారు. ఇటు పవన్‌ని సైతం అదే చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలో జనవాణి కార్యక్రమలో భాగంగా విశాఖకు వెళ్ళిన పవన్‌ని కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడం, ఓ హోటల్‌ని నిర్భందించడం చేశారు.
ఇక అలా చేయడంతో పవన్‌కు సింపతీ పెరిగేలా చేశారు. అదే క్రమంలో చంద్రబాబు వెళ్ళి పవన్‌ని పరామర్శించారు. దీంతో టిడిపి-జనసేనల మధ్య పొత్తు పొడిచినట్లు అయింది. ఆ తర్వాత కుప్పం పర్యటనకు వెళ్ళిన చంద్రబాబుని పోలీసులు ఆంక్షల పేరుతో అడుగడుగున అడ్డుకున్నారు. ఆయన్ని రోడ్ షోలు చేయనివ్వలేదు. దీంతో బాబు కాలినడకన కుప్పంలో పర్యటించారు. ఇక కుప్పం నుంచి హైదరాబాద్ వచ్చాక..చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్ళి సంఘీభావం తెలిపారు.
ఇలా బాబు-పవన్ మైత్రిని జగన్ బలపడేలా చేశారు. తాజాగా అనపర్తిలో చంద్రబాబుని ఎన్ని రకాలుగా అడ్డుకున్నారో తెలిసిందే. దీంతో బాబు నడుచుకుంటూ సభా ప్రదేశానికి వెళ్లారు. దీనిపై కూడా పవన్ స్పందించి..జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అంటే చంద్రబాబు-పవన్ స్నేహాన్ని జగన్ పెంచేలా ఉన్నారు. దీని వల్ల భవిష్యత్‌లో వైసీపీకే నష్టమని చెప్పవచ్చు.