కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో హుజూరాబాద్ లో హిటెక్కాయి రాజకీయాలు. అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్,బీజేపీ నాయకులు పోటా పోటీగా జెండాలు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని టి ఆర్ యస్, బీజేపి నాయకులు నినాదాలు చేస్తున్నారు. అంతేకాదు నిన్న సాయంత్రం టీఆర్‌ఎస్ నాయకుడు ఒకరు బీజేపీ నాయకుడిపై కర్రతో దాడి చేశారు.
దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకులు పరస్పర దాడులు ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ సంఘటనలో ఇరు పార్టీల నాయకులను అదుపు చేసేందుకు ప్రయత్నించిన సీఐ శ్రీనివాస్‌కు ముఖంపై గాయం అయింది. ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టిన పోలీసులు..కొంత మందిని అరెస్ట్ చేశారు.
సుమారు 45నిమిషాల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. ఇక హుజురాబాద్ అభివృద్ధి పై చర్చకు రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి.. హుజురాబాద్ లో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కుట్రలో భాగం పంచుకోవద్దని ఈటల పిలుపునిచ్చారు. తాము తలుచుకుంటే పొలిమేర దాకా తరిమి కొట్టే శక్తి తమకే ఉందని చిల్లర మాటలు నమ్మవద్దని ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు.