దావోస్ (స్విట్జర్లాండ్)లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటన కోసం ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టు నుంచి అనుమతి పొందారు. శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. ఈ సదస్సుకు హాజరుకానున్న ఏపీ ప్రతినిధి బృందానికి సీఎం జగన్ నేతృత్వం వహించనున్నారు. 10 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉండనున్నారు. కాగా కొవిడ్ కారణంగా రెండేళ్ల తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రత్యక్షంగా సమావేశం కానున్నది. పారిశ్రామిక నాలుగో విప్లవం (4.0) వేయాల్సిన అడుగులపై సీఎం ప్రసంగిస్తారు.
ఇదిలా ఉంటే.. సీబీఐ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న సీఎం జగన్ దేశం విడిచివెళ్లరాదని గతంలోనే కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన శుక్రవారం కోర్టులో పిటిషన్ వేశారు. సీఎంగా అధికారిక పర్యటనకు దావోస్ వెళ్లేందుకు అనుమతివ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ న్యాయస్థానం జగన్ దావోస్ వెళ్లేందుకు అనుమతిచ్చింది.