భారీ వర్షాలు వరదలతో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. దీంతో గోదావరి నదీ పరివాహక గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. వానలు తగ్గుముఖం పట్టినా..? ఇప్పటికే కొన్ని ప్రాంతాలు ముంపులోనే ఉండటం గమనార్హం. గత కొన్ని రోజులుగా కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు వరదలతో జలదిగ్భంధంలోనే ఉన్నాయి. జిల్లాలోని దాదాపు 18 మండలాలకు సంబంధించి 51 లంక గ్రామాలు వరద నీటిలో ఇబ్బందులు పడుతున్నాయి. వదర బాధితులకు అండగా నిత్యం ప్రజాపత్రినిధులు పర్యటిస్తూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ముంపు ప్రాంతాల ప్రజలను పరామర్శించి రావడంతో అది రాజకీయ రంగు పులుముకుంది. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాలో సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
బాధిత ప్రాంతాలను పరిశీలించి.. వరద బాధితులను పరామర్శించనున్నారు. పి. గన్నవరం మండలంలోని పలు గ్రామాలతో పాటు, లంకల గన్నవరం, మానేపల్లిలో వరద బాధితులను పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పర్యటనకు తగిన ఏపాట్లు చేస్తున్నారు. కేవలం ఈ రోజు మాత్రమే కాదు.. రేపు సైతం కోనసీమ జిల్లాలోనే సీఎం ఉండి.. అన్ని ప్రాంతాలకు వెళ్లి.. స్వయంగా ముంపు బాధితులకు హామీ ఇవ్వునున్నారు. ఇప్పటికే జగన్ పర్యటనతో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.