నేడు దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. సీఎం జగన్ కాస్త ఆలస్యంగా తండ్రికి నివాళులు అర్పించారు. అనంతపురం జిల్లాల్లో పర్యటన అనంతరం సీఎం జగన్ ఈ సాయంత్రం ఇడుపులపాయ చేరుకున్నారు. తండ్రి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రి సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం తండ్రిని స్మరించుకుంటూ కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ వెంట ఆయన తల్లి వైఎస్ విజయమ్మ కూడా ఉన్నారు. జగన్ వైఎస్ సమాధి వద్దకు రాగానే విజయమ్మ తనయుడ్మి ఆప్యాయంగా ముద్దాడారు. ఈ ఉదయం విజయమ్మ కుమార్తె షర్మిలతో పాటు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఈనెల 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండికోట వద్ద ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ వ్యూ పాయింట్ను పరిశీలిస్తారు. ఆ తర్వాత పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్ ఆఫీసు భవనాన్ని, రాణితోపులో నగరవనాన్ని, గరండాల రివర్ ఫ్రెంట్ వద్ద కెనాల్ డెవలప్మెంట్ ఫేజ్-1 పనులను, పులివెందులలో నూతనంగా నిర్మించిన (వైఎస్సార్ ఐఎస్ ఏ) స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, ఏపీ కార్ల్ న్యూటెక్ బయో సైన్సెస్ను ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమికి ప్రారంణోత్సవం చేస్తారు. అనంతరం ఇడుపులపాయకు చేరుకుంటారు. 10వ తేదీ ఉదయం 9 గంటలకు కడపలోని రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్ యూనిట్ ప్రారంనోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కొప్పర్తిలో పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు