తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వర్క్ షాప్ నిర్వహించారు. వవ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు పాలుపంచుకున్న ఈ సమావేశంలో జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఎన్నికల దాకా గడపగడపకు కొనసాగించాల్సిందేనని ఆయన సూచించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని మీడియాకు వివరాలు వెల్లడించారు. 2024 ఎన్నికల్లో 175 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారని నాని తెలిపారు. గడపగడపకు కార్యక్రమంలో పనితీరు బాగా లేని వారి సంఖ్య 27గా తేలిందని చెప్పిన జగన్… వారి పేర్లను మాత్రం వెల్లడించలేదన్నారు. పేర్లు వెల్లడిస్తే… ఒకరిని తక్కువ చేసినట్లు అవుతుందన్న కారణంగా జగన్ పనితీరు బాగా లేని నేతల పేర్లను వెల్లడించలేదన్నారు.
అయితే నవంబర్‌లో మరోమారు గడపగడపకుపై సమావేశం ఏర్పాటు చేస్తామని, అప్పటిలోగా పనితీరు బాగా లేని వారు పనితీరు మెరుగుపరచుకోవాలని జగన్ సూచించారన్నారు. ఎవరి పనితీరు బాగా లేదో వారికే ఈ విషయం బాగా తెలుసునని జగన్ చెప్పారన్నారు. పనితీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లను కేటాయించనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారన్నారు. ఎన్నికలకు ఇంకో 6 నెలల సమయం ఉందనగా టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటానని జగన్ చెప్పినట్లు నాని వెల్లడించారు. ఎన్నికల నాటికి పనితీరు బాగా లేని వారికి టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నారని తెలిపారు. రాజకీయాలను పార్ట్ టైంగా తీసుకునే వారికి అవకాశాలు ఇవ్వలేమని కూడా జగన్ చెప్పారన్నారు. రాజకీయాలను వృత్తిగా తీసుకున్న వారే రాణిస్తారని చెప్పారన్నారు. ఎన్నికల్లో సీట్లు కావాలంటే జనంలో ఉండాల్సిందేనని జగన్ తెలిపారన్నారు.