ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండే కేసీఆర్ సాగర్ లో అడుగుపెడతాడా ?

-

నాగర్జునసాగర్ ఉపఎన్నికలో అభ్యర్ధుల ఎంపిక,నామినేషన్లు అన్ని పూర్తయ్యాయి. ఇక ప్రచారం పై అన్ని పార్టీలు దృష్టిపెట్టాయి. నోముల న‌ర్సింహ‌య్య త‌న‌యుడు భ‌గ‌త్‌ కి టిక్కెట్ కేటాయించిన టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా వ్యూహాన్ని సిద్దం చేస్తుంది. ఇప్పటికే మండలాల వారీగా మంత్రులు,ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది టీఆర్ఎస్ అధిష్టానం.అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన ఏ ఉపఎన్నికలో ప్రచారంలో పాల్గొనని సీఎం కేసీఆర్ ఇప్పుడు సాగర్ లో ప్రచారం చేస్తారా లేదా అన్న ఆసక్తి నెలకొంది.

సాగర్ లో ఏప్రిల్‌ 17న ఉపఎన్నిక పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్ధులకు మద్దతుగా నియోజకవర్గంలో కేడర్ ని మొహరించాయి. కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డి చాపకింద నీరులా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ నుంచి మంత్రులు త‌ల‌సాని, మ‌హ‌మూద్ అలీ, ఎర్రబెల్లి, స‌త్యవ‌తి రాథోడ్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్రచారం మొద‌లుపెట్టారు. స‌భ‌లు, స‌మావేశాలు కాకుండా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి క్యాంపెయిన్ చేస్తున్నారు నాయకులు. మంత్రి తలసాని అన్ని తానై ఎన్నికల బాధ్యతలు చూసుకుంటున్నారు.

ఉపఎన్నిక ‌నోటిఫికేష‌న్ రాకముందే సీఎం కేసీఆర్ నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించారు. ఎత్తిపోతల ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేసి హాలియా బ‌హిరంగస‌భ‌లో ప్రసంగిస్తూ.. జిల్లాకు, నాగార్జున‌సాగ‌ర్‌కు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పారు సీఎం కేసీఆర్. ఇక సాగ‌ర్ ప్రచారానికి ఇప్పుడు 15 రోజులే గ‌డువుంది. ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్ వస్తారా లేదా అన్న ఆసక్తి రాజకీయపక్షాల్లో నెలకొంది. తెలంగాణలో ఇప్పటివరకు నారాయణ్ ఖేడ్,పాలేరు,హుజూర్ నగర్,దుబ్బాకలో ఉపఎన్నికలు జరిగాయి.

అయితే ఏ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం కేసీఆర్ హాజరవ్వలేదు. నారాయణ్ ఖేడ్ లో హరీశ్ కు ,పాలేరు కేటీఆర్ కి బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ హుజూర్‌న‌గ‌ర్ ఉపఎన్నికలో ప్రచారానికి ఆఖ‌రురోజు వెళ్లాల‌ని ఏర్పాట్లు చేశారు. ఆ రోజు వ‌ర్షం కారణంగా స‌భ ర‌ద్దయింది. ఇక దుబ్బాకలో హ‌రీష్‌రావుకు ప్రచార బాధ్యత‌లు అప్పగించి దూరంగా ఉన్నారు. గ్రేటర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. దుబ్బాక‌, గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఎదురుదెబ్బల త‌ర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలిచి ఉత్సాహంగా ఉన్న టీఆర్ఎస్ సాగ‌ర్‌ను చేజార్చుకోవ‌ద్దని భావిస్తోంది. దీంతో చివరి రోజైనా సీఎం కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్న ఆసక్తి నెలకొంది.

న‌ల్లగొండ జిల్లా నేత‌ల‌తో స‌మావేశమైనప్పుడు ప్రచారానికి వ‌స్తాన‌ని కేసియార్ చెప్పిన‌ట్టు ప్రచారం జరగింది. దీంతో ఉపఎన్నిక ప్రచారం సెంటిమెంట్ బ్రేక్ చేస్తూ ప్రచారం ముగియడానికి చివరిరోజు ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్‌ హాజరవుతారన్న చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version