ఈ మధ్య కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఆయన పర్యటన కొనసాగడం జరిగింది. ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా పరిశీలించి చూసారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు ఒక ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు తెలియచేసారు. అదేవిధంగా కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు సీఎం కెసిఆర్. మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండలం, రెడ్డికుంట తండా పర్యటన ముగియగానే సీఎం కేసీఆర్ బస్సులో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు.
అక్కడే బస్సును కాసేపు ఆపి తాను ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం చేశారు. సీఎం కేసీఆర్‌తోపాటు ఇతర మంత్రులు, అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భోజనం వడ్డించారు. భోజనంలో పులిహోర, పెరుగన్నం ఉన్నాయి. భోజనానంతరం సీఎంతోపాటు అందరూ అరటిపళ్లు తిన్నారు. ఆ తర్వాత సీఎం హెలిక్యాప్టర్ ద్వారా వరంగల్, కరీంనగర్ పర్యటనలకు బయలుదేరి వెళ్లి అక్కడ పరిశీలన కొనసాగింది. మహబూబాబాద్ పర్యటన కంటే ముందే ఆయన ఖమ్మం జిల్లాలో కూడా పర్యటించారు ముఖ్యమంత్రి కెసిఆర్.