సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ హై లైట్స్ ఇవే !

-

ధాన్యం కొనుగోలు అంశంపై అధికార టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు అంశంపై.. కేంద్రంపై నిన్న కేసీఆర్ మండిపడగా.. దానికి కౌంటర్ గా బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే బండి సంజయ్ ఇవాళ చేసిన వ్యాఖ్యలకు మరోసారి రివర్స్ కౌంటర్ ఇచ్చాడు సీఎం కేసీఆర్.

వరి పంట వేయడంపై కేసీఆర్ ప్రకటన :

వరి పంట వేయడం పై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎవరూ కూడా యాసంగి కాలంలో… వరి పంట వేయకూడదని సూచనలు చేశారు. యాసంగి లో వారికి బదులు ఇతర పంటలు వేసుకుంటే లాభాలు బాగా వస్తాయని చెప్పారు. సీడ్ కంపెనీకి.. అనుబంధమై ఉన్న రైతులు వరి పంట పండించుకోవచ్చు అని తెలిపారు. కానీ తెలంగాణ బిజెపి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచనలు చేశారు సీఎం కేసీఆర్. రైతులు పండించే దాన్యం పై బండి సంజయ్ ఏమి మాట్లాడలేదు..వడ్ల విషయం తప్ప అన్ని మాట్లాడారని మండిపడ్డారు.

రుణమాఫీపై కీలక ప్రకటన :

తెలంగాణ రైతులకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుభవార్త చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణమాఫీ ని పూర్తిగా చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇప్పటికే 25వేలు, 50 వేలు ఉన్న రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. అతి త్వరలోనే లక్ష రూపాయలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీపై రైతులు ఎవరు ఆందోళన చెందనవసరం లేదని భరోసా కల్పించారు సీఎం కేసీఆర్. రుణమాఫీపై ప్రతిపక్షాలు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదని.. వాళ్లవి అన్ని తప్పుడు ప్రచారం అని మండిపడ్డారు.

పత్తి రైతులకు గుడ్ న్యూస్ :

తెలంగాణ పత్తి రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. యాసంగిలో వరిని వేయద్దని రైతాంగానికి సూచించిన కేసీఆర్ పత్తిని మాత్రం సాగు చేయాలని సూచించారు. తెలంగాణలో పండిన పత్తికి అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ లో ఉందన్నారు. రైతులు పత్తిని సాగు చేయాలన్నారు. కోటి ఎకరాల్లో పత్తిని సాగుచేస్తున్నారని..మరింత పెరిగినా ఇబ్బంది లేదని కేసీఆర్ అన్నారు. గతంలో తెలంగాణ వ్యాప్తంగా 28 జిన్నింగ్ మిల్లులు ఉంటే ప్రస్తుతం పత్తి జిన్నింగ్ మిల్లుల సంఖ్య రాష్ట్రంలో 400 పెరిగిందన్నారు. ఒక వేళ సీసీఐ కొనుగోలు చేయకున్నా మేం కొనుగోలు చేస్తామని ప్రైవేటు వ్యాపారులు చెబుతున్నారని కేసీఆర్ అన్నారు. గతంలో పత్తి వేయమని నేనే చెప్పాను… ప్రస్తుతం ఇది నిజమవుతుంది కదా… పత్తికి ధర రూ. 8 వేలను దాటింది కదా.. అని సీఎం కేసీఆర్ అన్నారు.

శుక్రవారం నుంచి టిఆర్ఎస్ పార్టీ ధర్నా :

ధాన్యం కొనుగోలు పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12 వ తేదీ నుంచి ధ్యానం కేంద్రం కొనాలని తెలంగాణ రాష్ట్రంలోని నియోజక వర్గ కేంద్రాల్లో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీ బిజేపి పార్టీ నుంచి అక్షింతలు పడ్డాయని.. అందుకే వరి ధాన్యం కొనుగోలు విషయం బండి సంజయ్ వదిలేశారని ఫైర్ అయ్యారు.

దళితులకు రిజర్వేషన్లు :

ప్రభుత్వ లైసెన్సులు ఇచ్చే అన్ని షాపుల్లో కూడా దళితులకు రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు ఇచ్చామని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇటీవలే మార్గదర్శకాలు వచ్చాయన్నారు. ఇక మీదట మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చే అన్ని షాపుల్లో కూడా దళితులకు ఇక మీదట రిజర్వేషన్లు అమలు చేస్తాం అన్నారు.

దళిత బంధు పథకం :

దళిత బంధు దేశంలో, ప్రపంచంలోనే అద్భుత పథకం అని కేసీఆర్ అన్నారు. మీ మొహానికి మీ పాలించే రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి పథకం ఉందా ..? అని బీజేపీని ప్రశ్నించారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పూర్తిగా అమలు చేస్తామన్నారు. ఇప్పటికే రూ. 2 వేల కోట్లు విడుదల చేశాం అన్నారు. మరో నాలుగు మండలాల్లో కూడా అమలు చేస్తాం. మార్చిలోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని వంద మంది లబ్ధిదారులకు పథకాన్ని అమలు చేస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంఘం రూ.20 వేల కోట్లతో పథకాన్ని మరింత బలోపేతం చేస్తాం అన్నారు. రానున్న రెండేళ్లలో 4-5 లక్షల కుటుంబాలకు పథకాన్ని అందిస్తామన్నారు.

ఫామ్ హౌజ్ సిఎం ఆరోపణలు :

బండి సంజయ్ కేసీఆర్ ఫామ్ హౌజ్ ను దున్నుతాం అని బండి సంజయ్ కామెంట్లకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఫామ్ హౌజ్ దున్నడానికి బండి సంజయ్ ఏమైనా ట్రాక్టర్ డ్రైవరా.. అని ఎద్దేవా చేశారు. చట్టానికి, భూసంస్కరణలకు అనుగుణంగా బాజాప్తా భూమిని కొనుగోలు చేశామన్నారు. ఫామ్ హౌజ్ దున్నడానికి రా.. ఆరు ముక్కలు అవుతావ్ అని తీవ్ర స్వరంతో బండి సంజయ్ ని హెచ్చిరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం మా కుటుంబం అనేక త్యాగాలు చేసిందన్నారు. మిడ్ మానేరు డ్యాం కోసం మా కుటుంబానివి, మా అత్తగారి కుటుంబానివి భూములను కోల్పోయాం. తర్వాత మాకు అనుకూలంగా ఉన్న చోట భూములను కొనుకున్నాం అని కేసీఆర్ అన్నారు.

బండి సంజయ్ కి కెసిఆర్ సవాల్ :

గొర్రెల పైసలు తాము ఇచ్చామని.. గొర్రెల పైసలు కేంద్రం ఇచ్చినట్లు నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని బండి సంజయ్ కి సవాల్ విసిరారు తెలంగాణ సిఎం కెసిఆర్. తెలంగాణ లో ఉన్న ఒక్క పథకం అయిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉందా ? అని ప్రశ్నించారు కెసిఆర్. ఈ పథకం కోసం అప్పు తీసుకుని వడ్డీ కడుతున్నామని.. బీజేపీ రాష్ట్రాల్లో ఎందుకు ఈ పథకం లేదని నిలదీశారు. కర్ణాటక లో ప్రభుత్వం కూల్చి దొడ్డి దారిన ప్రభుత్వం నడుపుతున్నారని.. ప్రభుత్వాలను కూల్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని బిజేపి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 107 సీట్లలో బీజేపీ డిపాజిట్ పోయిందని.. నాగార్జున సాగర్ లో కూడా బీజేపీ డిపాజిట్ పోయిందని చురకలు అంటించారు.

నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్ :

బీజేపీ ఏ వర్గ ప్రజలకు మెలు చేసింది అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష ఉద్యోగాలు ఇచ్చామని ఇంకో 70వేల ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. త్వరలో నోటిఫికేషన్ వెలువరిస్తామని….ఉద్యోగుల కోసమే అనేక సంస్కరణలు చేసామని కేసీఆర్ అన్నారు. నిరుద్యోగ సమస్య దేశంలో ఎంత ఉంది…తెలంగాణ లో ఎంత ఉంది అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.

ప్రతిరోజు కెసిఆర్ ప్రెస్ మీట్ :

బండి సంజయ్ వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. బండి సంజయ్ మీడియా కాన్ఫరెన్స్ తర్వాత మరోసారి ఈరోజు కెసిఆర్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… వరి ధాన్యం పండించాలని చెబుతున్నారని కానీ కేంద్రం చేత కొనిపిస్తావా అని అడిగితే దానికి సమాధానం ఇవ్వలేదని అన్నారు. ముందు దానికి సమాధానం ఇవ్వాలని కేసీఆర్ అన్నారు. ఏది పడితే అది మాట్లాడుతుంటే ఊరుకునేది లేదని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఇకనుండి తానే ప్రతిరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడతాను అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడ ఉన్నాడు ?

తెలంగాణ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్. తెలంగాణ ఉద్యమంలో నువు ఎక్కడ పన్నావ్ ? నీ ఉనికి తెలంగాణ సమాజానికి తెలియదని బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. నిన్న మొన్న వచ్చి మాట్లాడుతున్నావ్… రాష్ట్రంలో ,దేశంలో నువు ఎవడికి తెలుసని అగ్రహించారు కెసిఆర్. తెలంగాణ లో ప్రభుత్వ పథకం అందని ఇళ్ళు లేదని మండిపడ్డారు కెసిఆర్.

దేశద్రోహి వ్యాఖ్యలకు కెసిఆర్ కౌంటర్ :

కేంద్ర ప్రభుత్వాన్ని, బిజెపి పార్టీ అని ప్రశ్నిస్తే దేశద్రోహి ముద్ర వేస్తారా ? అని నిలదీశారు సీఎం కేసీఆర్. ఇవాళ ప్రెస్ మీట్ లో బండి సంజయ్… మొత్తం సొల్లు పురాణం మాట్లాడారని మండిపడ్డారు. బిజెపి దేశద్రోహులను తయారు చేసే ఫ్యాక్టరీ గా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను మద్దతు తెలిపిన అప్పుడు దేశభక్తులుగా కనిపించి… ఇప్పుడు కేంద్రాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహుల ముద్ర వేస్తున్నారని నిప్పులు చెరిగారు. బార్డర్ లో చైనాలో దురాక్రమణకు పాల్పడుతుందని.. మాట్లాడితే దేశద్రోహులు అంటున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్.

బీజేపీకి కేసీఆర్ వార్నింగ్

ఇకపై మిమ్మల్ని వదిలేది లేదు. ఎక్కడిక్కడ నిలదీస్తాం అంటూ బీజేపీకి కేసీఆర్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. వరిని వేయద్దని వేస్తే శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని బీజేపీని గురించి కేసీఆర్ విమర్శించారు. ఇవ్వాల్టి సమావేశంలో బీజేపీ తీరు అర్థం అయిందని కేసీఆర్ అన్నారు. బీజేపీ వస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లే అని అన్నారు. సొల్లు పురాణం చెబుతూ రైతుల్ని మోసం చేసేలా బీజేపీ వ్యవహారం ఉందన్నారు. బీజేపీ ధాన్యం కొనేదాకా పోరాటం చేస్తామని వదిలేది లేదని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news