ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిరుత పులి పిల్లలకు నామకరణం చేసి పాలు పట్టారు. గోరఖ్ పూర్ లోని అష్పాఖ్హుల్లా ఖాన్ జూలాజికల్ పార్కులో బుధవారం చిరుత పులి పిల్లలకు చండీ, భవాని అని నామకరణం చేశారు. అనంతరం ఆ రెండు పులులకు సీఎం పాలు పట్టారు. ఆయన చుట్టూ పశు వైద్యులు ఉండగా పాలసీసా తో పులి పిల్లలకు పాలు పట్టారు.
రెండున్నర నెలల క్రితం గోరఖ్పూర్ జంతుప్రదర్శనశాలకు తీసుకువచ్చిన తెల్ల పులి గీతను కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రధాన ఎన్ క్లోజర్ లోకి తీసుకెళ్లారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ జూ అంతా కలియదిరిగారు. పూర్వాంచల్ ప్రాంతంలో ఇదే తొలి జూ పార్క్ కాగా.. ఉత్తరప్రదేశ్లో మూడోది. పులి పిల్లలకు పాలు తాగిస్తున్న సీఎం వీడియోను ప్రభుత్వం తన అధికారిక యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.