తాహతుకు మించి అప్పులు చేసి సర్కారును నడపవచ్చని నిరూపించాయి టీడీపీ మరియు వైసీపీ. దీనిపై కేంద్రం ఎన్నో సార్లు అభ్యంతరాలు చెప్పినా కూడా ఆరోజు టీడీపీ కానీ ఈ రోజు వైసీపీ కానీ వినిపించుకోలేదు.తాజాగా కొన్ని ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆస్తులను అమ్ముకుని మరీ! రాష్ట్ర ప్రభుత్వం రోజులు నెట్టుకువస్తుంది.ఈ దశలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీన్లోకి ఎంటర్ అయ్యారు.రాష్ట్ర ప్రభుత్వం తప్పులను ముఖ్యంగా అప్పులను వాటి పరిణామాలను వివరంగా చెప్పారు.అంతేకాదు ఏపీ లో మాఫియా కల్చర్ రాజ్యమేలుతుందని కూడా అన్నారు.
డబుల్ ఇంజన్ సర్కారుతోనే రాష్ట్రం మరియు రాయలసీమ అభివృద్ధి సాధ్యమని కూడా చెప్పారు.ఓ విధంగా వైసీపీకి ఝలక్ ఇచ్చారు కిషన్ రెడ్డి. పైకి జగన్ తో ఎంతో స్నేహంగా ఉండే కిషన్ రెడ్డి లోపల మాత్రం తనదైన రాజకీయం నడుపుతున్నారన్నది ఈ వ్యాఖ్యలే చెబుతున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అదేవిధంగా ఎన్నడూ లేనిది జగన్ మోహన్ రెడ్డి సర్కారును ఉద్దేశించి నియంతల పాలన ఎక్కువ కాలం ఉండదని కూడా జోస్యం చెప్పారు.
ఆంధ్రా అప్పులపై బీజేపీ నేత కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత కొంత కాలంగా పరిధికి మించి అప్పులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్రం చాలా గుర్రుగా ఉందన్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో బీజేపీ సర్కారు చేయాల్సినంత సాయం కేంద్రం తరఫున చేస్తున్న కూడా ఏపీ గండం నుంచి గట్టెక్కడం లేదు.ఈ దశలో ఆంధ్రావని అప్పుల ఆంధ్ర గా మారిపోయిందని కిషన్ రెడ్డి ఆవేదన చెందారు.ఇదే కనుక జరిగితే భవిష్యత్ లో ఉద్యోగుల జీతాల చెల్లింపునకు కూడా కష్టాలు తలెత్తడం ఖాయమని అంటున్నారీయన.ఇక వీటిపై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా ఉంది.
వాస్తవానికి ఏడేళ్ల కాలంలో రెండు పార్టీలు కలిపి చేసిన అప్పు ఏడు లక్షల కోట్ల రూపాయలు దాటిపోయింది.మరో మూడులక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు.మొత్తం పది లక్షల కోట్ల అప్పు మిగిల్చి 2024 నాటికి వైసీపీ గద్దె దిగనుంది.అంటే ఆ నాటికి ఉన్న అప్పుకు వడ్డీలు కలుపుకుని కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం తిప్పలు పడాలి.
అందుకే కేంద్రం మొదట్నుంచి ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ వస్తోంది. రైతుకు ఉచిత విద్యుత్ పథకం కూడా ఏ పాటి కూడా లాభసాటి కాదని తేల్చేసింది. గిట్టుబాటు ఇవ్వకుండా సరైన కాలంలో ధాన్యం కొనుగోలు చేయకుండా రుణమాఫీ పేరిట డ్రామాలు నెరపడం కూడా తప్పేనని నిపుణులు సైతం ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నారు.ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి.
అయినా కూడా వైసీపీ సర్కారు మేల్కోవడం లేదు.భూములు అమ్మకం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలి అని యోచిస్తోంది కానీ అది కూడా అయ్యేలా లేదు.ఈ తరుణంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తేనే ఫలితాలు వస్తాయని అంటున్నారు కిషన్ రెడ్డి.రానున్న కాలంలో జనసేనతో కలిసి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని కూడా చెబుతున్నారు.వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని మరో మారు స్పష్టం చేశారాయన.