పెళ్ళి చేసుకున్నాక సినిమాల్లో కనిపించకుండా పోయిన చాలామంచి హీరోయిన్లలో కలర్స్ స్వాతి ఒకరు. లండన్ బాబులు సినిమా తర్వాత పెళ్ళి చేసుకున్న స్వాతి, ఆ తర్వాత మళ్ళీ తెరపై కనిపించలేదు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అష్టాచమ్మా, కార్తికేయ సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన ఈ భామ, మళ్ళీ సినిమాల్లోకి ఎంటీ ఇవ్వనుంది. ఈ మేరకు తాజాగా స్వాతి నటిస్తున్న సినిమా నుండి ప్రకటన వచ్చింది. పంచతంత్రం పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో స్వాతి కీలక పాత్రలో కనిపిస్తుంది.
బ్రహ్మానందం, మత్తువదలరా ఫేమ్ నరేష్ అగస్త్య, శివాత్మికా రాజశేఖర్, రాహుల్ విజయ్, సముద్రఖని నటిస్తున్న ఈ సినిమాలో స్వాతి నటిస్తుంది. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు. కలర్ ఫోటో సినిమాతో దర్శకుడిగా మారిన సందీప్ రాజ్, పంచతంత్రం సినిమాకి హర్షతో కలిపి మాటలు రాస్తున్నాడు. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పై అఖిలేష్ వర్ధన్, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు.