పశ్చిమగోదావరి: జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో కరోనా కలకలం రేగింది. ఆలయ కేశఖండనశాల సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆలయ సిబ్బందిలోనూ, అటు భక్తుల్లో ఆందోళన నెలకొంది. దేవస్థానం కేశఖండనశాలలో పనిచేస్తున్న 50 మంది క్షురకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
అయితే అందులో ఐదుగురు క్షురకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆలయ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. సిబ్బందితో పాటు ఆలయంలో మొక్కుబడులు తీర్చుకున్న భక్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. దీంతో దేవస్థానం ఆలయ సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఆలయంలో అధికారులు, పర్మినెంట్ సిబ్బంది, ఎన్‌ఎంఆర్, అవుట్ నర్సింగ్, సెక్యూరిటీ, శానిటేషన్ ఇలా అన్నిసెక్షన్లు కలిపి మొత్తం 800 మందికి పైగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మరో 40 మంది ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రోజుకు ఒక సెక్షన్ చొప్పున సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు