ఆగ‌స్టు చివరి వ‌ర‌కు కోవిడ్ మూడో వేవ్ వ‌చ్చే అవ‌కాశం.. తీవ్ర‌త త‌క్కువే: ICMR

-

కోవిడ్ మూడో వేవ్ ( Covid Third Wave ) ఎప్పుడు వ‌స్తుంది ? ఎంత మేర ప్ర‌భావం చూపిస్తుంది ? అన్న చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా సాగుతున్న నేప‌థ్యంలో ICMR కీల‌క విష‌యాన్ని వెల్ల‌డించింది. కోవిడ్ మూడో వేవ్ భార‌త్ లో ఆగ‌స్టు చివ‌రి వ‌ర‌కు ప్రారంభం అయ్యేందుకు అవ‌కాశాలు ఉన్నాయని, అయితే తీవ్ర‌త మాత్రం రెండో వేవ్ క‌న్నా త‌క్కువ‌గానే ఉంటుంద‌ని తెలిపింది. ఈ మేర‌కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కు చెందిన‌ ఎపిడెమియాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హెడ్ డాక్టర్ సమీరన్ పాండా వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

 

covid third wave | కోవిడ్ మూడో వేవ్
covid third wave | కోవిడ్ మూడో వేవ్

దేశవ్యాప్తంగా మూడవ వేవ్ ఉంటుంది, కానీ ఇది రెండవ వేవ్ లాగా ఎక్కువ తీవ్రంగా ఉండ‌దు.. అని డాక్టర్ పాండా చెప్పారు. మొదటి, రెండో వేవ్‌ల‌లో ప్రజలు రోగనిరోధక శక్తిని పొందార‌ని, అందువ‌ల్లే మూడ‌వ వేవ్‌లో తీవ్ర‌త త‌క్కువ‌గా ఉండేందుకు అవ‌కాశం ఉంద‌న్నారు.

కాగా ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఇదే విష‌యంపై మాట్లాడుతూ.. సామాజిక దూరం పాటించ‌క‌పోవ‌డం, మాస్కుల‌ను ధ‌రించ‌క‌పోవ‌డం వంటివి కోవిడ్ మూడో వేవ్‌కు కార‌ణ‌మ‌వుతాయ‌ని అన్నారు. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌న్నారు. సామాజిక దూరం పాటించ‌డంతోపాటు మాస్క్‌ల‌ను ధ‌రించాల‌ని, వీలైనంత త్వ‌ర‌గా టీకాల‌ను తీసుకోవాల‌ని అన్నారు. దీంతో కోవిడ్ మూడో వేవ్ తీవ్ర‌త‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌న్నారు.

అయితే కొత్త కోవిడ్ వేరియంట్లు వ‌స్తున్న‌ప్పటికీ అందుబాటులో ఉన్న టీకాల ద్వారా ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌వ‌చ్చ‌ని గులేరియా చెప్పారు. కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వి కాకుండా అనేక ఇతర టీకాలు దేశంలో అందుబాటులోకి రానున్నాయ‌ని తెలిపారు. కోవిడ్ మూడవ వేవ్ ఇతర దేశాలలో కనిపిస్తున్నదని గులేరియా అన్నారు. అయితే టీకాలు పనిచేస్తున్నాయని ఆయ‌న తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news