వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్, రాష్ట్ర బీజేపీ ఎంపీ బండి సంజయ్ తన పై చేసిన ఆరోపణలపై స్పందించారు. నన్ను లక్ష్యంగా చేసుకుని బండి సంజయ్ అనేక ఆరోపణలు చేశారు అని ఆయన వెల్లడించారు. చెయ్యని తప్పులు మోపారు అని సీపీ తెలిపారు. నా బాధితులు బండి సంజయ్‌ను కలిశారని ఏదో పేపర్లో చదివాను అని రంగనాథ్ తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం ప్రజలు నన్ను గుర్తు పెట్టుకున్నారు అని అన్నారు సీపీ. నేను ఎవరి పక్షాన ఉంటాను అనేది నాకంటే బాగా, నేను పని చేసిన చోట ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు.
బండి సంజయ్ దగ్గరికి వచ్చిన బాధితుల్లో ఎవరై ఉంటారంటే.. అరెస్టు అయిన రౌడీషీటర్లు, పీడీయాక్ట్ నమోదైనవారు, చీటింగ్ కేసుల్లో ముద్దాయిలు అయి ఉండొచ్చు. భూ కబ్జాదారులు ఉండొచ్చు. అయితే నా వద్దకు భూకబ్జాదారులు, రౌడీషీటర్లు, చీటర్ల బాధితులు వస్తారు. వాళ్లంతా సామాన్యులు, పేదవర్గాల నుండి వచ్చిన వారు ఉంటారు. వాళ్లందరూ కూడా రేపు బయటకు వచ్చి.. జరిగిన సంగతి చెప్తారు. ఇది ప్రజలకు కూడా తెలియాలి అని రంగనాథ్ అన్నారు. తాను ఒక్క సెటిల్‌మెంట్, ఒక్క దందా, ఒక్క డీల్ కానీ నాకు లాభం వచ్చేలా ఏదైనా చేసినట్లు నిరూపిస్తే.. అక్రమ ఆస్తులు ఉన్నట్టు నిరూపిస్తే ఉద్యోగం వదిలిపెట్టి వెళ్లిపోతాను అని రంగనాథ్ సవాల్ చేశారు.