ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరెంట్ కోతలతో… అక్కడి ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు. రోజుకు 7 గంటల పాటు కరెంట్ కోతలు విధించడమే కాకుండా..పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించింది సర్కార్. అయితే.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ ఇదే సమస్య ప్రారంభం అయింది. డిమాండ్ కు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో.. త్రీ ఫేజ్ సరఫరా వేళల్లో కోతలు విధిస్తున్నారు.
తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరగడం, సరిపోయేంత కరెంట్ నిల్వలు లేకపోవడం, కొనుగోలు సమస్య ఉండటంతో.. వ్యవసాయానికి త్రీఫెజ్ విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గురువారం రాత్రంతా సింగిల్ ఫేజ్ మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని టీఎస్ ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఆయా జిల్లాల ఎస్‌ఈలు, డీఈలకు ఆదేశాలు జారీ చేసింది.
డిమాండ్ కు తగినంతగా సరఫరా లేకపోవడంతోనే వ్యవసాయ కరెంట్ కు కోతలు విధించాల్సి వస్తోందని.. రైతులు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు కోరుతున్నారు. మరో 10 రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.