కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు చేయిదాటిపోతోంది. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు నానా అవస్థలు పడుతున్న నేతలు ఓవైపు ఉంటే.. మరోవైపు నాయకత్వంపై అసంతృప్తితో మరికొందరు నేతలు ఆపార్టీని వీడుతున్నారు. అయితే.. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో.. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు మళ్లీ అధ్యక్ష స్థానంలో ఎవరిని కూర్చోబెట్టాలోనని కసరత్తు మొదలైంది. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నేటి మధ్యాహ్నం మూడున్నర గంటలకు సమావేశం అవుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌కు ఆమోదం తెలిపేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
వైద్య పరీక్షల కోసం సోనియాగాంధీ విదేశాలకు వెళ్లడం, ఆమెకు తోడగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వెళ్లడంతో వారు ఈ సమావేశానికి వర్చువల్‌గా హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఐదు దశాబ్దాలపాటు కీలక నేతగా వ్యవహరించిన గులాంనబీ ఆజాద్ పార్టీని వీడడం, వెళ్తూవెళ్తూ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో.. ఈ సమావేశంలో సోనియా, రాహుల్ నాయకత్వంపై నేతలు విశ్వాసం ప్రకటించే అవకాశం ఉంది. కాగా, కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు కాంగ్రెస్ నిర్వహించనున్న జోడో యాత్రకు రాష్ట్రాలవారీగా సమన్వయకర్తలను పార్టీ నియమించింది. ఏపీకి డాలీశర్మ, తెలంగాణకు ఎస్‌వీ రమణి ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తారు.