అదే జరిగితే హుజూరాబాద్‌లో గులాబీ పార్టీకి షాక్ తప్పదా!

-

హుజూరాబాద్ ఉపఎన్నికల పోరు ఎప్పుడు ముగుస్తుందో తెలియదు గానీ, ఇక్కడ ఎవరు గెలుస్తారో తెలియదుగానీ, ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఈ ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారని రాష్ట్ర ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ ఉత్కంఠకు తగ్గట్టుగానే హుజూరాబాద్‌లో రోజుకో ట్విస్ట్ వస్తుంది. దీని వల్ల హుజూరాబాద్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

ఈ క్రమంలోనే తాజాగా హుజూరాబాద్‌లో సరికొత్త ట్విస్ట్ వచ్చింది. అధికార టీఆర్ఎస్‌ని ఓడించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఉన్న 7,600 ఫీల్డ్ అసిస్టెంట్లని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి కోసం పనిచేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎప్పటినుంచో ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు తమని విధుల్లోకి తీసుకోవాలని ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

కానీ వీరి విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే వారు ప్రభుత్వానికి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ వారిని వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు షాక్ తగిలే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు కోసం రైతులు నిజామాబాద్ పార్లమెంట్ బరిలో పెద్ద ఎత్తున నామినేషన్స్ వేశారు. దీని వల్ల అక్కడ ఫలితం ఎలా వచ్చిందో చెప్పాల్సిన పనిలేదు. కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి పాలయ్యారు.

ఇప్పుడు అదే పరిస్తితి హుజూరాబాద్‌లో రిపీట్ అయితే టీఆర్ఎస్‌కే ఇబ్బంది వచ్చేలా కనిపిస్తోందని అంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున నామినేషన్స్ వేస్తే టీఆర్ఎస్‌కు అనుకూల వాతావరణం ఉండదు. పైగా ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయట్లేదనే భావన ప్రజల్లోకి వెళుతుంది. కాబట్టి ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు హుజూరాబాద్‌లో కారుకు షాక్ ఇచ్చేలాగానే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news