దేశ రాజధాని నగరమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య 250 వార్డుల్లో ఓట్ల గణన సాగుతోంది. ఈ నెల 4వతేదీన జరిగిన ఎన్నికల్లో 50 శాతం ఓట్లు పోలయ్యాయి. 250 వార్డుల్లో 1349 మంది ఎన్నికల బరిలో నిలిచారు.ఓట్ల లెక్కింపు కోసం 42 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల అభ్యర్థుల మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. బుధవారం జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఉదయం 9 గంటలకు ఆప్ అభ్యర్థులు 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
బీజేపీ అభ్యర్థులు 120 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. నాలుగు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు పోటాపోటీగా మారడంతో ఢిల్లీ మున్సిపల్ ముఖచిత్రం ఆసక్తికరంగా మారింది. అయితే.. 68 మంది ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో ఎంసీడీ ఓట్ల లెక్కింపు సాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా 136 మంది ఈసీఐఎల్ ఇంజినీర్లను నియమించారు. 42 కౌంటింగ్ కేంద్రాల్లో ఫలితాలను ప్రకటించేందుకు ఎల్ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర కార్యాలయమైన నిగం భవన్ లో మీడియా సెంటరును ఏర్పాటు చేశారు.