భీమ్లా నాయక్ వివాదం నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో ఇదే విషయం చర్చనీయాంశం అవుతోంది.ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాను నెత్తినపెట్టుకుని చూస్తుంటే,విరివిగా రాయితీలు ప్రకటించి ఐదో షోకు కూడా అనుమతులిస్తే, మరోవైపు ఆంధ్రాలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమయిన వాతావరణం ఒకటి నెలకొని ఉంది. అస్సలు ఏ మాత్రం అంగీకారంలో లేని ధరలు జీఓ 35 పేరిట ప్రకటించిన ఏపీ సర్కారు దానినే కొనసాగిస్తూ,కొన్ని బీ,సీ సెంటర్లలో ఐదు రూపాయలకు, పది రూపాయలకు టిక్కెట్ల అమ్మకాలు చేపట్టాలని హుకుం జారీ చేసి,దాని అమలుకు సైతం పట్టుబడుతోంది.
అక్కడితో ఆగక వీఆర్వోలను, ఎంఆర్వోలను థియేటర్లకు పంపి,వారికి తోడుగా అదనపు పోలీసు బలగాలను కూడా పంపి థియేటర్ల దగ్గర ఓ ఉద్రిక్త వాతావరణం నెలకొనేందుకు కారణం జగన్ అయ్యారన్న వాదన ఒకటి ఆధారసహితంగా పవన్ అభిమానులు వినిపిస్తున్నారు.ఈ తరుణంలో నిన్నటి వేళ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ కొడాలి నాని కానీ ఇష్టం వచ్చిన విధంగా రెచ్చిపోయారు. భీమ్లా నాయక్ సినిమా పోయిందని,అందుకే బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకుని కొంతయినా బయటపడాలని చూస్తున్నారని వెల్లంపల్లి అన్నారు.
అదేవిధంగా కొడాలి నాని కూడా తామేమీ ఫిబ్రవరి 25నే సవరించిన టికెట్ ధరలకు సంబంధించిన జీఓ తీసుకువస్తామని చెప్పలేదని, అయినా అఖండ సినిమా అయినా భీమ్లా నాయక్ అయినా తమకు ఒక్కటేనని వ్యాఖ్యానించి మరో వివాదానికి తెరతీశారు.ఇదే సమయంలో భీమ్లా నాయక్ పై రోజా కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.భీమ్లా నాయక్ సినిమా విషయమై పవన్ నష్టపోతున్నాడని అంటున్నారని, నష్టపోయేందుకు ఆయన ఏమైనా నిర్మాతా, డిస్ట్రిబ్యూటరా అని ఎదురు ప్రశ్నించారు.
ఈ విధంగా వైసీపీ నాయకులు తాము చేసిన లేదా తాము చేయాలనుకుంటున్న చర్యలను సమర్థించుకుంటూ ఒకరి తరువాత ఒకరు, ఒకరిని మించి మరొకరు మీడియా ఎదుట వ్యాఖ్యలు చేస్తూ వివాదం తీవ్రతను రోజురోజుకీ పెంచుతున్నారు.దీంతో పవన్ కూ, జగన్ కూ మధ్య దూరం పెరిగిపోతోంది.ఇదే సందర్భంలో పవన్ అభిమానులు తాము వచ్చే ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేస్తున్నారు.
ఎవరి మాటలు ఎలా ఉన్నా పవన్ మాత్రం సినిమా విడుదల తరువాత ప్రస్తుతం రేగుతున్న ఏ వివాదంపై కూడా పెద్దగా మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. మెగాబ్రదర్ నాగబాబు మాత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారే కానీ పవన్ మాత్రం మౌనాన్నే పాటిస్తున్నారు. ఇదే సందర్భంలో జగన్ కూడా ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేయకుండా నిర్మాణాత్మక వైఖరి పాటించి తగ్గితేనే మంచిదన్న వాదన ఒకటి సుస్పష్టంగా వైసీపీ శ్రేయోభిలాషుల నుంచి వినవస్తోంది.
– డైలాగ్ ఆఫ్ ద డే – మనలోకం ప్రత్యేకం