తిరుప‌తి వైసీపీ చేజార‌నుందా?

-

తిరుప‌తి సిట్టింగ్ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద‌రావు మృతిచెంద‌డంతో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. స్థానిక సంస్థ‌ల్లో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న వైసీపీ తిరుప‌తిలో గెలుపు సులువ‌ని, మెజార్టీపైనే దృష్టిపెట్టాల్సి ఉంటుంద‌ని అక్క‌డి నేత‌లు, అనుచ‌ర‌గ‌ణం లెక్క‌లేసుకుంటున్నారు. మెజార్టీ విష‌యంలో దేశం మొత్తం ఇటువైపు చూడాలంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం రేగింది. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి అవుతార‌ని భావిస్తున్న చింతా మోహ‌న్ చేసిన వ్యాఖ్య‌లే దీనికి కార‌ణం. రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాం నుంచీ రాయ‌ల‌సీమ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. ‌సీమ‌కు ఎటువంటి గుర్తింపు లేకుండా పోయింద‌న్న చింతా ఏపీకి రెండో రాజ‌ధానిగా తిరుప‌తిని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు.

తిరుప‌తిలో అభివృద్ధి ఏదీ?‌

తిరుప‌తిలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏదీ లేదు. స్థానిక సంస్థ‌ల్లో సాధించిన ఘ‌న‌విజ‌యం ఊపులో ఉన్న పార్టీ ఇక్క‌డ కూడా సులువుగా గెలుస్తుంద‌నే అంచ‌నాలున్నాయి. అయితే రాయ‌ల‌సీమ వెన‌క‌బ‌డివుంది.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.. తిరుప‌తిని రెండో రాజ‌ధానిగా చేయాల‌ని మాజీ ఎంపీ చింతా మోహ‌న్ చేసిన వ్యాఖ్య‌లు వైసీపీకి నష్టం చేకూర్చ‌నున్నాయ‌నే ప్ర‌చారం ఊపందుకుంటోంది. గెలుపు ఏక‌ప‌క్షంగా ఉంటుంద‌నుకుంటున్న త‌రుణంలో ప్ర‌జ‌ల్లో రెండో రాజ‌ధాని సెంటిమెంట్ ర‌గిలితే ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని వైసీపీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ‌తా

వాస్త‌వానికి రెండో రాజ‌ధాని డిమాండ్ ఇప్ప‌‌టిది కాదు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఎంపీగా ఉన్న చింతా వివ‌రాల‌ను అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌కు అంద‌జేశారు. కాల‌క్ర‌మంలో అది మ‌రుగున ప‌డిపోవ‌డంతో ఆయ‌న మ‌ళ్లీ ఆ విష‌యాన్ని త‌వ్వితీశారు.
తిరుప‌తి ఉప ఎన్నిక జ‌రుగుతున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దీనిపై స్ప‌ష్ట‌త‌ ఇవ్వాల‌ని చింతా మోహ‌న్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నినాదాన్ని తిరుప‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్తాన‌న్నారు. ప్ర‌స్తుతం చింతా వ్యాఖ్య‌లు తిరుప‌తి రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌భావం చూపుతాయంటున్నారు ప‌రిశీల‌కులు. అధికార పార్టీ తిరుప‌తిలో ఇంత‌వ‌ర‌కు ఎటువంటి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌లేదు. రెండో రాజ‌ధాని విష‌యంపై ఇక్క‌డి ప్ర‌జ‌లు కూడా ఆస‌క్తిగా ఉన్నార‌ని చెబుతున్నారు. సెంటిమెంట్ ర‌గిలితే అది అధికార వైసీపీకి ఆందోళ‌న‌క‌ర ప‌రిణామంగా మారుతుందా? అనే ఉత్సుక‌త ఆ పార్టీ నేత‌ల్లోనే ఉంది. తిరుప‌తి భ‌విష్య‌త్తు తిరుప‌తి ఓట‌ర్లు ఇచ్చే తీర్ప‌పైనే ఆధార‌ప‌డివుంది.

Read more RELATED
Recommended to you

Latest news