తెలంగాణలో ఈ సారి చాలామంది టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎదురీదుతున్నారని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. గత రెండు ఎన్నికల మాదిరిగా ఈ సారి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవడం కష్టమని తెలుస్తోంది. అదే సమయంలో ఈ సారి కొందరు మంత్రులు కూడా గెలవడం సాధ్యమయ్యే పని కాదని సర్వేలు చెబుతున్నాయి. ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో కొందరు మంత్రులు డేంజర్ జోన్ లో ఉన్నారని తేలింది. సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి..ఇలా కొందరు మంత్రులు డేంజర్ జోన్ లో ఉన్నారని, వారు నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడం కష్టమే అని సర్వేలు చెబుతున్నాయి.
ఇక ఇందులో కొప్పుల ఈశ్వర్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన గత ఎన్నికల్లోనే దాదాపు ఓటమి అంచుకు వెళ్లారు. కేవలం 441 ఓట్ల తేడాతో గెలిచి బయటపడ్డారు…అలాగే మంత్రి అయ్యారు. అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చాక కొప్పుల బలం పెద్దగా ఏమి పెరగలేదని తెలుస్తోంది. పైగా రాష్ట్రంలో టీఆర్ఎస్ బలం తగ్గుతూ వస్తుంది. అలాగే ధర్మపురి నియోజకవర్గంలో కొప్పులకు పెద్దగా పాజిటివ్ కూడా లేదని తెలుస్తోంది.
అసలు కొప్పుల తెలంగాణ రాజకీయాల్లో చాలా సీనియర్ నేత..మొదట టీడీపీలో రాజకీయం మొదలుపెట్టి…తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చారు. 2004లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మేడారంలో గెలిచారు…తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి…ఉపఎన్నికలో మరొకసారి గెలిచారు. ఇక 2009 నుంచి ధర్మపురిలో కొప్పుల గెలుస్తూ వస్తున్నారు. 2009లో ధర్మపురి ఎమ్మెల్యేగా గెలిచారు…2010 ఉపఎన్నికలో కూడా సత్తా చాటారు. ఇక 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచారు.
అయితే ఇలా వరుసగా గెలిచిన కొప్పులకు ఈ సారి ధర్మపురిలో గెలుపు అవకాశాలు తగ్గిపోయాయి…వరుసగా గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోతున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై సానుభూతి ఎక్కువ ఉంది. ఈ సారి ధర్మపురిలో కాంగ్రెస్ గెలుస్తుందని ఇటీవల వచ్చిన ఓ సర్వేలో తేలింది. అంటే నెక్స్ట్ కొప్పులకు గెలుపు చాలా కష్టమే అని చెప్పొచ్చు.