కరోనా అనే మూడక్షరాల తీవ్రవాదం కారణంగా వైద్యం అత్యవసరం అయి అందక ప్రాణాలు పోయిన వారున్నారు. చదువులు ముందుకు వెళ్లక డ్రాపౌట్లుగా మిగిలిన వారు ఉన్నారు. డిజిటల్ చదువులు అందక అవస్థ పడిన వారు ఉన్నారు. వీటన్నింటికీ విజ్ఞాన శాస్త్రంను మాత్రమే బాధ్యులం చేయలేం. ఆర్థిక శాస్త్రంది కూడా బాధ్యతే! పరిశోధనలకు కావాల్సినంత నిధులు ఇవ్వకుండా ఉంటే మంచి ఫలితాలు, టీకాలు, మందులు, వ్యాధి కారక నివారిణులు, నొప్పి నివారిణులు ఎక్కడి నుంచి వస్తాయి అని! ప్రభుత్వాలు పరిశోధనా రంగానికి ప్రాధాన్యం ఇకపై ఇవ్వాలి అని కోరుకుందాం.
అత్యాశే కానీ తప్పదు. రోగం విలువ తెలిసివచ్చాక ఆర్థిక మాంద్యం పుట్టుకు వచ్చింది. ఆర్థిక మాంద్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం అన్నది తగని పని! ఆ పని కారణంగా దేశం వెనుకబడి పోతోంది. కనుక ఆర్థిక మాంద్య నివారణ చర్యలు వెంటవెంటనే తీసుకుంటే ద్రవోల్బణం ఉండదు. ప్రోత్సహకాలు అందిస్తే సంక్షోభమూ ఉండదు. ధరల స్థిరీకరణకు నిధి ఏర్పాటు చేస్తే సామాన్యుడికి మేలు. చేయగలరా మేడమ్! విల్ యూ ప్లీజ్ ఫాలో దీజ్..
కరోనా కారణంగా ఎకనమిక్ గ్రోత్ ఆగిపోయిందని అంటున్నారు. అదేవిధంగా రెండు దశల్లో కరోనాను దాటి మూడో దశకు చేరుకున్న వైనంలో భాగంగా చాలా వరకూ అవరోధాలు కానీ అడ్డంకులు కానీ దాటేశాం అని కూడా వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా విదిల్చిన సవాళ్లను దాటినా కూడా ఆర్థిక పురోగతి అన్నది లేకుండా పోతోంది అన్నది ఓ బాధ. కొన్ని ఉత్పత్తి రంగాలకు కేంద్రం చేయూత లేని కారణంగానే వాళ్లంతా కుదుపులకు లోనై, కుదేలయిపోతున్నారన్నది మరో దుఃఖం. దుఃఖ విమోచనకు బడ్జెట్ కాస్తయినా సాయం చేస్తే మేలు.
కష్టకాలంలో మన ఎకానమీ దూసుకుపోతోందని ప్రధాన మీడియాలోవచ్చిన కొన్ని మాటలు చెబుతున్నాయి. నిజంగానే దూసుకుపోతే ఉత్పత్తిరంగాలు అన్నీ కోలుకోవాలి. బీమా కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు మానుకోవాలి. అదేవిధంగా రైతుకు కచ్చితమైన భరోసా దక్కాలి. కానీ ఇవేవీ రావడం లేదు. అంటే కేంద్రం చెబుతున్న గ్రోత్ రేట్ అన్నది అబద్ధం అయినా కావాలి లేదా పూర్తి అవాస్తవిక చిత్రణ అయినా కావాలి. నిజాలు దాచి ఎందుకిలా అంకెలు గారడీ చేస్తున్నారో?
-డిస్కషన్ పాయింట్ – మనలోకం ప్రత్యేకం