ఇప్పటికీ కేసీఆర్ కొన్నంటే కొన్ని విషయాల్లో నచ్చుతారు. ఆంధ్రోళ్ల ను కడుపున దాచుకుంటానని అత్యంత భావోద్వేగంతో పలికిన కేసీఆర్ ఓ విధంగా మాట తప్పలేదు. వాళ్లను అలానే చూసుకుంటున్నారు. సొంత సామాజిక వర్గం కన్నా ఆర్థికంగా బలంగా ఉన్న సామాజిక వర్గ నేతలను బాగా ప్రోత్సహించారు అన్న మాటను ఆయన తిప్పి కొట్టలేకపోయినా, వాళ్లంతా ఫక్తు చంద్రబాబు మనుషులే అని తేలిపోయినా పదవులు ఇచ్చి గౌరవించారు. ఓ విధంగా ఇదొక రాజకీయ అవసరం. అదే మాట ఎన్నో సార్లు ఒప్పుకున్నారు. ఆ విధంగా కేసీఆర్ లో ఉన్న రాజకీయ చతురత ఆకట్టుకుంటుంది. కోపం ఉంటే తిట్టడం లేదంటే గంగ వెర్రెత్తిపోయిన విధంగా ప్రశంసలతో ముంచెత్తడం ఒక్క కేసీఆర్ కే సాధ్యం. ఏదేమయినప్పటికీ ఇప్పటికీ ఆయనకు ఇటు ఆంధ్రాలో మంచి అభిమానులే ఉన్నారు. వారిలో చాలా మంది సొంత సామాజిక వర్గానికి చెందిన మనుషులు కాకపోయినా, ఒకవేళ రేపు ఏదో ఒక పేరుతో జాతీయ పార్టీ ఆరంభిస్తే వీళ్లంతా ఆయనకు మద్దతుగానే ఉంటారు. కేసీఆర్ కు ఇక్కడి భౌగోళిక స్వరూపం తెలుసు. ఆంధ్రా లోగిళ్లకు ఆయన వస్తే ఆదరించే కుటుంబాలు ఉన్నాయి కనుక ఓ విధంగా ఆయన ఏమనుకున్నా సాధించేందుకు వీలుంది. ఇంకా చెప్పాలంటే తెలంగాణ వచ్చాక ఆయన ఆంధ్రా పై అభిమానం పెంచుకున్నారు. కవితక్క కూడా ఆంధ్రా ఎంపీల కన్నా ఎంతో గొప్పగా ఇక్కడి సమస్యలను వెలుగులోకి తెచ్చారు. పార్లమెంట్ వేదికగా ఆ రోజు కవితక్క జై ఆంధ్రా నినాదం వినిపించారు. కనుక కొన్ని విషయాల్లో కేసీఆర్ కారణ జన్ముడే. ఆయన బిడ్డలు కూడా మంచి వాగ్ధాటి ఉన్న నాయకులే కాదు ప్రజలను అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నవారే !
బక్క చిక్కిన మనిషికి ధర్నా చౌక్ ఆతిథ్యం ఇచ్చింది. వాడ వాడ తిరిగి పార్టీ జెండాను రెపరెపలాడించాలని భావించిన కేసీఆర్ ను తెలంగాణ నెత్తిన పెట్టుకుంది. ఆ మట్టి గంధాలను పరిమళాలను ఒంటికి పూసుకున్నవాడు ఒక్కడే కేసీఆర్ అని ఇవాళ తెలంగాణ జాగృతి కీర్తిస్తోంది. ఆ విధంగా ఆయన ఎన్నటికీ తిరుగులేని నేతగానే ఉండాలని కోటిన్నొక్క దేవుళ్లను కోరుకుంటోంది. సాధారణంగా కేసీఆర్ చాలా పట్టుదల మనిషి అని, ఆయన అనుకుంటే ఇప్పటిదాకా సాధించనది ఏమీ లేదని ప్రశంసిస్తోంది. ఇదే వేళ ఆ రోజు తెలంగాణ కోసం ఏ విధంగా ఉద్యమాలు నడిచాయో కూడా గుర్తు చేసుకుంటున్నది తెలంగాణ జాగృతి మరియు తెలంగాణ రాష్ట్ర సమితి.
ఇవాళ తెలంగాణ వాకిట టీఆర్ఎస్ జెండా పార్టీ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేళ ఎన్నో ఆశల పతాకలు నింగిని ముద్దాడనున్నాయి. సమైక్య పాలకులను ధిక్కరించి, అవమానాలు భరించి, సహించి ప్రత్యేక తెలంగాణ కలను సాకారం చేసిన పెద్దాయనను అంతా ఈ వేళ మరో సారి కీర్తిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా ఎన్నో సాహసోపేత నిర్ణయాలకు నాంది పలికిన విధానంను ఒక్కసారి గుర్తు చేసుకుని కేసీఆర్ అనుచరులు పొంగిపోతున్నారు. ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నా రు. దేశ్ కీ నేత కేసీఆర్ అన్న నినాదాన్ని ఎక్కువగా వినిపించేందుకు ఇష్టపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఎంతగా ఆయన కృషి చేశారో మరువలేం అని తెలంగాణ జాగృతి సభ్యులు కూడా మరో సారి స్మరిస్తూ ఉన్నారు. ఆ విధంగా కేసీఆర్ కారణ జన్ముడు అని ప్రణభ్ ముఖర్జీ (మాజీ రాష్ట్రపతి) ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యను గుర్తు చేసుకుంటున్నారు.