తెలుగు చిత్ర సీమలో విలక్షణ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి గుమ్మడి వెంకటేశ్వరరావు. ఐదొందలకు పైగా చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు గుమ్ముడి..ఈయన తన నటనకు గాను రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు. తనకంటే పెద్ద వారైన నటులకు కూడా తండ్రిగా నటించిన గుమ్మడి..ఎలాంటి పాత్రలనైనా చాలెంజింగ్ గా తీసుకుని నటించేవారు.
ఓ చిత్రంలో గుమ్మడికి పెద్ద కుమారుడిగా ఏఎన్ఆర్ నటించారు. కానీ, నిజానికి ఏఎన్ఆర్ గుమ్మడి వెంకటేశ్వరరావు కంటే మూడేళ్లు పెద్దవాడు. అలా తనకంటే పెద్ద వారైన వారికి తండ్రిగా నటించారు గుమ్మడి. ఇక గుమ్మడి-ఎన్టీఆర్ ల పరిచయం విషయానికొస్తే…వీరిరువురి పరిచయం ఓ హోటల్ లో జరిగింది. అది కాస్త స్నేహంగా మారడంతో ..సీనియర్ ఎన్టీఆర్ పిలిచి మరీ ఆయనకు తన సినిమాల్లో అవకాశాలు ఇప్పించారు.
అలా గుమ్మడి..ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తున్నారు. కానీ, గుమ్మడి ఎక్కువగా ఏఎన్ఆర్ సినిమాల్లో నటించడంతో ఆయనకు ‘అక్కినేని మనిషి’ అని ముద్ర పడింది. దాంతో ఎన్టీఆర్ ఆయనను దూరం పెట్టారు. తన కూతురు పెళ్లికి రావాలని సీనియర్ ఎన్టీఆర్ కు గుమ్మడి శుభ లేఖ ఇచ్చినప్పటికీ ఆ వివాహ వేడుకకు ఎన్టీఆర్ హాజరు కాలేదు.
అప్పటికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య కాస్త విభేదాలు ఉన్నాయట. అయితే, ఎన్టీఆర్-ఏఎన్ఆర్ కలిసిపోయిన క్రమంలో గుమ్మడిని పట్టించుకోలేకపోయానని సీనియర్ ఎన్టీఆర్ బాధపడ్డారట. తెలుగు చిత్ర సీమకు రెండు కళ్లలాగా ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎప్పటికీ ఉంటారని ఇప్పటికీ సినీ ప్రముఖులు చెప్తుంటారు.