బ్రదర్ అనీల్ డ్రాప్ అయిపోయాడు.కొత్త పార్టీ ఊసేలేదని తేల్చేశాడు.దీంతో టీ కప్పులో రేగిన తుఫాను ఒక్కసారిగా తీరం దాటి పోయింది.ప్రస్తుతానికి అంతా ప్రశాంతంగా ఉన్నా, రేపటి వేళ ఇదే విధంగా వాతావరణం ఉంటుందని ఆశించలేం. ఇదే సమయంలో అనిల్ వినిపించిన సమస్యలు అన్నీ ఒక్కసారిగా జగన్ ను చుట్టుముట్టుకోనున్నాయి. ముఖ్యంగా జగన్ సర్కారు పై ఎప్పటి నుంచో కొన్ని అభియోగాలున్నాయి.వీటినే బీసీ సంఘాలు, క్రిస్టియన్ సంఘాలు ఏకరువు పెట్టాయి అనిల్ ఎదుట! కనీసం తమ బాధలు చెప్పుకునే వీల్లేదని వేదన చెందాయి.ఇక ముందస్తు అరెస్టులపై చాలా అంతర్మథనం అయితే వ్యక్తం అయింది.
మరోవైపు కొత్త పార్టీ రానుందన్న ఆశ తప్పు అని తేలేసరికి సంబంధిత నాయకులు చాలా డీలా పడిపోయారు.టీడీపీ నుంచి కానీ వైసీపీ నుంచి కానీ కొన్ని వలసలు ఉంటాయని వార్తలు వచ్చినా, బ్రదర్ వెంట వారు నడుస్తారని స్పష్టం అయినా కూడా ఇప్పటికిప్పుడు పార్టీ లేదని తేలిపోవడం ఊరించి ఉస్సూరుమనిపించిన వైనంపై సర్వత్రా కొంత అసంతృప్తి ఉంది.
టీడీపీ ని టార్గెట్ చేస్తూ ఏదయినా ఒక పార్టీ వస్తే బాగుండు అన్న ఆలోచన ఒకటి ఎప్పటి నుంచో వైసీపీ చేస్తోంది.అందుకు జనసేన ఉన్నా కూడా తాజా పరిణామాల నేపథ్యంలో మరో పార్టీ కూడా రంగంలోకి వస్తే బాగుంటుంది అని కూడా అనుకుంటున్నారు. ముద్రగడ ఒక పార్టీ తెస్తే,మరోవైపు నెల్లూరు యాదవుల నేతృత్వంలో మరో పార్టీ ఉంటే ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుందని అప్పట్లో ఆనందయ్యను కూడా బాగానే దువ్వారు.ఒక బావ అనిల్ పార్టీ పెట్టినా నష్టం టీడీపీకి, లాభం వైసీపీకే! ఇది ఫిక్స్ భయ్యా రాసుకో !