పోలీసుల కళ్లుకప్పి.. జీప్‌తో పరార్.. ఏళ్లనాటి కలను నెరవేర్చుకున్న డ్రైవర్..!

-

మనలో చాలామందికి కొన్ని క్రేజీ డ్రీమ్స్ ఉంటాయి. అయితే ఉంటాయి కానీ..వాటిని తీర్చుకోవడానికి మనం పెద్దగా శ్రద్ధ పెట్టం..అయితే అతనికి కూడా ఒక కోరిక ఉండేది..ఏళ్లు గడిచినా అది తీరటం లేదు..ఎలా తీర్చుకోవాలనా అనే పాపం ఆలోచిస్తూనే ఉండేవాడట. మొత్తానికి ఒకరోజు కలనెరవేరింది..కానీ జైలు పాలయ్యాడు. లాంగ్ డ్రైవ్ కి వెళ్లాలన్నది అతని కల. అది కూడా మామూలు వాహనంతో కాదు. పోలీస్ వాహనాన్ని నడుపుతూ వెళ్లాలన్నది కలట. అందుకే జైల్లో వేశారు..ఇంతకీ ఎలా చేశాడో చూద్దాం..

అతని పేరు నాగప్ప హడపాద్. వయసు 45 ఏళ్లు. కర్ణాటకలోని అన్నిగెరీ టౌన్ లో ఉంటున్నాడు. డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. లారీ నడుపుతున్న అతనికి కొన్నేళ్లుగా పోలీస్ జీప్ నడపాలనే కోరిక ఉండేది… తీరని కలలా ఉండిపోయింది. పనిలో భాగంగా అతను కర్ణాటకతోపాటూ… దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాలకు ట్రక్ నడుపుతూ వెళ్లేవాడు. ఎక్కడికి వెళ్లినా, ఎంత దూరం డ్రైవ్ చేసినా అతనికి అది ఆనందం కలిగించలేదు. ఎందుకంటే అది లారీ కాబట్టి. మనోడికి పోలీస్ జీపులో లాంగ్ డ్రైవ్ వెళ్లానది కదా కల.

నాగప్ప తరచూ అన్నిగెరీ పోలీస్ స్టేషన్ వైపుగా వెళ్లేవాడు. అక్కడ ఓ పోలీస్ జీప్ పార్క్ చేసి ఉండేది. దాన్ని చూడగానే అతనికి ఎక్కడ లేని ఆనందం వచ్చేది. దాన్ని తనే తోలుతున్నట్లు భావించేవాడు. కానీ ఏనాడూ దాన్ని టచ్ కూడా చెయ్యలేదు. తాజాగా గత బుధవారం అటుగా వెళ్తూ ఆ జీప్‌ని చూశాడు. జీప్ దగ్గర ఎవరూ లేరు. పైగా అది అన్ లాక్ చేసి ఉంది. దాని కీ కూడా దానికే ఉంది. అంతే… ఇక తన కల నెరవేరినట్లే అనుకున్నాడు.

నాగప్ప జీప్ వైపు చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు..ఆన్ డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులు..గురక పెట్టి నిద్రపోతున్నారు. జీప్ ఎత్తుకుపోవడానికి ఇంతకంటే బెస్ట్ టైమ్ ఉండదు అనుకున్న నాగప్ప… అంతే జీపులోకి దూకి… ఆన్ చేసి రయ్యిన దూసుకుపోయాడు. జీప్ స్టార్ అవ్వగానే… పోలీసులకు మెలకువ వచ్చింది… అరెరే… ఆగు ఆగు అని వారు అరుస్తున్నా… నాగప్ప స్పీడ్ గా వెళ్లిపోయాడు.

జీప్ ఎటువెళ్లిందే అటు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు పోలీసులు. పోలీసులకు నగరంలో కానీ… ఆ చుట్టుపక్కల గానీ ఎక్కడా జీప్ కనిపించలేదు. ఎలా కనిపెట్టాలి అని ఆలోచిస్తున్న సమయంలో… ఎవరో కాల్ చేశారు. బ్యాడాగీ టౌన్ నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు పక్కన ఓ జీప్ ఆగివుందనీ… అందులో ఓ వ్యక్తి నిద్రపోతున్నాడని చెప్పారు. అలర్టైన పోలీసులు… వేగంగా బ్యాడాగీకి వెళ్లారు.

112 కిలోమీటర్ల అవతల బ్యాడాగీ టౌన్ లో రోడ్డుపక్కన ఉన్న జీపును చూడగానే పోలీసులకు ప్రాణం లేచొచ్చింది. హమ్మయ్య దొరికేసింది అనుకున్నారు. దగ్గరకు వెళ్లి చూస్తే… గాఢ నిద్రలో ఉన్నాడు నాగప్ప. “రేయ్… లేరా లే…” అంటూ నాలుగు తగిలిస్తే… అసలు విషయం చెప్పాడు. అతని కల గురించి చెప్పడంతో అది తెలుసుకొని పోలీసులు నోరెళ్లబెట్టారు.

జీప్ చోరీ చెయ్యకుండా తన కోరికను చెప్పి ఉంటే… పోలీసులే దాన్ని తోలేందుకు చిన్న అవకాశం ఇచ్చేవాళ్లేమో. అలా చెయ్యకుండా అతను చోరీ చెయ్యడంతో… నేరం చేసినట్లైంది. కేసు రాసి అతన్ని అరెస్టు చేశారు. జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news