గోవాలో దూధ్ సాగర్ వాటర్ ఫాల్స్ dudhsagar waterfalls అని అందమైన జలపాతం ఉంది. ఎత్తైన పర్వతాల మధ్య నుంచి వచ్చే ఓ చీలికలో జలపాతం నీరు కిందకు దూకుతూ దర్శనమిస్తుంది. అయితే ఆ నీరు సాధారణ నీరులా ఉండదు. పాల వలె తెల్లగా ఉంటుంది.
చుట్టూ పచ్చని దొంతరను పరుచుకున్నట్లుగా.. ఎత్తైన పర్వతాలపై ఉన్న చెట్లు.. ఎటు చూసినా రమణీయత ఉట్టిపడే ముగ్ధ మనోహర ప్రకృతి సౌందర్యం.. మధ్యలో కొండల నుంచి జాలువారే నీళ్లు.. తెల్లని పాల నురగను పోలి ఉండే సెలయేటి ప్రవాహం.. వెరసి ఆ ప్రాంత అందాలను మాటల్లో వర్ణించలేం. అలాంటి ప్రదేశంలో గడపాలంటే ఎవరికైనా ఆసక్తిగానే ఉంటుంది కదా. అయితే ఇంకెందుకాలస్యం.. అక్కడికే వెళ్దాం పదండి.. అందుకు వేరే దేశం వెళ్లాల్సిన పనిలేదు. మన దేశంలోనే గోవా వెళ్తే చాలు.. పైన చెప్పిన అద్భుతమైన ప్రదేశానికి చేరుకోవచ్చు. ఇంతకీ అదేమిటంటే…
గోవాలో దూధ్ సాగర్ వాటర్ ఫాల్స్ అని అందమైన జలపాతం ఉంది. ఎత్తైన పర్వతాల మధ్య నుంచి వచ్చే ఓ చీలికలో జలపాతం నీరు కిందకు దూకుతూ దర్శనమిస్తుంది. అయితే ఆ నీరు సాధారణ నీరులా ఉండదు. పాల వలె తెల్లగా ఉంటుంది. నురగను కూడా కలిగి ఉంటుంది. అందుకే ఆ జలపాతాన్ని దూధ్‌సాగర్ జలపాతం అని కూడా పిలుస్తారు.
దూధ్‌సాగర్ జలపాతం మొత్తం 4 అంచెల్లో ఉంటుంది. గోవాలోని మండోవి నదిపై ఈ జలపాతం ఉంటుంది. పనాజి నుంచి 60 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి ఈ జలపాతానికి చేరుకోవచ్చు. మన దేశంలో ఉన్న ఎత్తైన జలపాతాల్లో దూధ్‌సాగర్ జలపాతం కూడా ఒకటిగా పేరుగాంచింది. దీని ఎత్తు సుమారుగా 310 మీటర్లు. వెడల్పు 30 మీటర్లు. పశ్చిమ కనుమల్లోని భగ్‌వాన్ మహావీర్ శాంక్చువరీ, మొలెం నేషనల్ పార్కులలో ఈ జలపాతం ఉంటుంది.
దూధ్‌సాగర్ జలపాతం ఉన్న అరణ్య ప్రాంతం జీవవైవిధ్యానికి కూడా పేరుగాంచింది. ఎన్నో అరుదైన జాతులకు చెందిన పక్షులు, జంతువులు ఈ అరణ్యంలో ఉంటాయి. దీంతో పర్యాటకులు ఓ వైపు జలపాతం అందాలను ఆస్వాదించడంతోపాటు మరోవైపు అభయారణ్యంలో ఉండే అనేక జంతువులు, పక్షులను కూడా చూడవచ్చు. అలాగే అరణ్యంలో ఉండే పర్వతాలపై ట్రెక్కింగ్ చేసేందుకు వెసులుబాటును కూడా కల్పించారు. మరింకెందుకాలస్యం.. దూధ్‌సాగర్ జలపాతంలో పాల వలె ఉండే నీటి అందాలను, అభయారణ్యం ప్రకృతి శోభను చూసేందుకు అక్కడికి వెళ్లి రండి మరి..!