కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కోవిడ్ టీకాల పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని ప్రజలకు కోవిషీల్డ్, కోవాగ్జిన్ అని రెండు రకాల వ్యాక్సిన్లు ఇస్తున్నారు. అయితే కోవిషీల్డ్ మొదటి, రెండో డోసులకు మధ్య విరామాన్ని పెంచారు. ఇప్పటి వరకు ఈ వ్యాక్సిన్ మొదటి డోసును ఇచ్చాక 4 వారాల అనంతరం రెండో డోసును ఇచ్చేవారు. కానీ దాన్ని 8 వారాలకు పెంచారు.
కోవిషీల్డ్ రెండు డోసులకు మధ్య వ్యవధి గతంలో 4 వారాలే ఉండేది. అయితే వ్యవధిని 8 వారాలకు పైగా పెంచితే వ్యాక్సిన్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని తేల్చారు. మొదటి డోసు ఇచ్చాక రెండో డోసును 4 వారాలకు ఇస్తే వ్యాక్సిన్ 54.9 శాతం ప్రభావం చూపించిందని, అదే రెండో డోసును 6-8 వారాల మధ్య ఇస్తే 59.9 శాతానికి వ్యాక్సిన్ ప్రభావం పెరిగిందని, అదే 9-11 వారాల తరువాత అయితే 63.7 శాతం, 12 వారాల కన్నా ఎక్కువ సమయం పాటు ఆగి రెండో డోసు ఇస్తే వ్యాక్సిన్ 82.4 శాతం వరకు ప్రభావం చూపిస్తుందని వెల్లడైంది. అందుకనే రెండో డోసు తీసుకునే వ్యవధిని పెంచారు.
అయితే సైంటిస్టులు ఈ విషయాన్ని అధ్యయనాల ద్వారా వెల్లడించారు. కానీ వాటి పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు. అయినప్పటికీ మొదటి డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక రెండో డోసును చాలా వారాల తరువాత ఆగి తీసుకుంటే వ్యాక్సిన్ మెరుగ్గా పనిచేస్తుందని చెబుతున్నారు.