రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భూమి కంపించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి, వింజమూరు, కొండాపురం, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అనేక గ్రామాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించినట్టు గుర్తించారు. ఉన్నట్టుండి భూమి కంపించడంతో ప్రజలు హడలిపోయారు.
ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. అటు, ప్రకాశం జిల్లాలో పామూరు మండలంలోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. పామూరు, పరిసర గ్రామాల్లో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఇళ్లు స్వల్పంగా కుదుపులకు గురికావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. భూ ప్రకంపనలు వచ్చినప్పుడు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఆరుబయట ఉండాలని అధికారులు సూచించారు. భవంతులు, భారీ చెట్ల దగ్గర ఉండవద్దని పేర్కొన్నారు.