ఎడిట్ నోట్: బషీర్‌బాగ్ ఘటన..కేసీఆర్ వర్సెస్ రేవంత్.!

-

ఉచిత విద్యుత్ పై పోరు కాస్త..బషీర్ బాగ్ కాల్పుల ఘటనపై చర్చకు దారి తీసింది. గత కొన్ని రోజులుగా ఉచిత విద్యుత్ పై బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కే‌సి‌ఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంటే..అసలు కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తుందని బి‌ఆర్‌ఎస్ కౌంటర్లు ఇస్తుంది. అయితే ఉచిత విద్యుత్ తెచ్చిందే కాంగ్రెస్ అని, 24 గంటల కరెంట్ ఇచ్చిదే కాంగ్రెస్ అని అంటున్నారు.

ఇలా ఉచిత విద్యుత్ పై పోరు కాస్త 2000లో ఉమ్మడి ఏపీలో జరిగిన బషీర్ బాగ్ కాల్పుల ఘటనపై చర్చ మొదలైంది. 1999లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ పెట్టారని, కానీ అప్పుడు అధికారంలోకి వచ్చిన టి‌డి‌పి ప్రభుత్వంలో కే‌సి‌ఆర్ కీలక పాత్ర పోషించి..విద్యుత్ లో కొత్త సంస్కరణలు తీసుకొచ్చేలా చంద్రబాబుకి సలహాలు ఇచ్చారని, దాని వల్ల విద్యుత్ ఛార్జీలు పెరగడం..దానిపై విపక్షాలు, రైతులు బషీర్ బాగ్ లో ధర్నాలు చేయడం, దాని వల్ల కాల్పులు జరిగి కొంతమంది మరణించడం జరిగిందని రేవంత్ ఆరోపించారు.

Basheer Bagh Firing

దీనికి బి‌ఆర్‌ఎస్ నుంచి హరీష్ రావు కౌంటర్ ఇస్తూ.. ఆ నాడు సి‌ఎం చంద్ర‌బాబు క‌రెంట్ బిల్లులు పెంచితే తీవ్రంగా వ్య‌తిరేకించింది కేసీఆర్ అని, 2000, ఆగ‌స్టు 28న బ‌షీర్‌బాగ్ కాల్పులు జ‌రిగితే అదే రోజు అప్ప‌టిక‌ప్పుడు రైతు హృద‌యంతో కేసీఆర్ స్పందించారని, అధికార పార్టీలో ఉండి, డిప్యూటీ స్పీక‌ర్‌గా కొన‌సాగుతూ.. పెంచిన విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గించాల‌ని కోరారని అన్నారు. నాడు చంద్ర‌బాబు రైతుల‌ను కాల్చి చంపితే.. క‌డుపు ర‌గిలి మా రైతుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని చెప్పి, బిల్లులు త‌గ్గించాల‌ని లేదంటే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని లేఖలో పేర్కొన్నారని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

ఇక దీనికి మళ్ళీ రేవంత్ కౌంటర్ ఇస్తూ..చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ పాలసీలను రూపొందించే హెచ్‌ఆర్డీ విభాగానికి కేసీఆర్‌ చైర్మన్‌. అప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా, గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక పదవిలో ఉన్నారు. వీళ్లంతా చంద్రబాబుతో కలిసి విద్యుత్తు పాలసీని తయారు చేశారని, మరి బషీర్‌బాగ్‌ కాల్పులకు కేసీఆర్‌, పోచారం, గుత్తా కారణం కాదా? అని రేవంత్‌ ప్రశ్నించారు.

నాడు కేసీఆర్‌ డిప్యూటీ స్పీకర్‌గా కూడా ఉన్నారని, బషీర్‌బాగ్‌ కాల్పులు జరిగింది 2000 సంవత్సరంలో అయితే.. తాను టీడీపీలో చేరింది 2007లోనని, అలాంటిది తాను ఎలా బాధ్యుడిని అవుతానో, కేసీఆర్‌ ఎలా బాధ్యుడు కాదో మంత్రి హరీశ్‌ చెప్పాలన్నారు. ఇలా బషీర్ బాగ్ కాల్పులపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇక ఉచిత విద్యుత్ పై చర్చలు నడుస్తున్నాయి. మరి వీరిలో ప్రజలు ఎవరు మాట నమ్ముతారు..ఎవరికి మద్ధతు ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news