మొత్తానికి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ పార్టీగా మారిపోయింది..ఇకపై కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేయడంతో..తాజాగా కేసీఆర్…బీఆర్ఎస్ జెండాని సైతం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇక 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానం ముగిసింది. ఇకపై బీఆర్ఎస్ పార్టీ తెరపైకి రానుంది. అయితే బీఆర్ఎస్ పార్టీని ఏ స్థాయిలో విస్తరిస్తారు. కేవలం తెలంగాణకే పరిమితమైన పార్టీని…దేశ వ్యాప్తంగా ఎలా విస్తరిస్తారు. ఇతర రాష్ట్రాల్లో చక్రం తిప్పడం సాధ్యమేనా..బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం సాధ్యమేనా? అంశాలని చూడాల్సి ఉంది.
ఇప్పటికే బీఆర్ఎస్ విధివిధానాలు ఏంటో కేసీఆర్ చెప్పేశారు. ప్రధానంగా రైతుల కోసమే పార్టీ పనిచేయనుంది. భారత ప్రజలు అవకాశమిేస్త తెలంగాణ మాదిరిగా రెండేళ్లలోనే బీఆర్‌ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం 24 గంటలపాటు కరెంటును అందించగలుగుతుందని, ఏటా 25 లక్షల కుటుంబాలకు దళితబంధు అందిస్తామని కేసీఆర్ చెబుతున్నారు. అటు సాగునీరుపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు.
అయితే విధానాలు బాగానే ఉన్నాయి గాని..వాటిని ఎంతవరకు అమలు చేయగలుగుతారు..అసలు ముందు ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పాగా వేయడం సాధ్యమేనా? అనే అంశాలని పరిశీలించాల్సి ఉంది. తెలంగాణ దాటితే బీఆర్ఎస్ పార్టీకి బలం లేదు. ఇక పార్టీ బలం పెంచడానికి తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలపై ఫోకస్ చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ పెట్టనున్నారు.
ఇక బీఆర్ఎస్ పార్టీలో కీలక బాధ్యతలని కీలక నాయకులకు అప్పగించేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. కేసీఆర్ ఎలాగో జాతీయ అధ్యక్షుడు అవుతారు కాబట్టి..తెలంగాణకు కేటీఆర్‌ని అధ్యక్షుడుగా పెడతారని తెలిసింది. ఆయనే తెలంగాణలో కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే కేటీఆర్‌ని సీఎం చేస్తారనే ప్రచారం ఉంది. అదేవిధంగా హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి లాంటి నేతలకు ఇతర రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
కేకే, వినోద్ కుమార్‌లకు కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీగా మారడంతో పార్టీలోని పదవులని కూడా మార్చాల్సి ఉంటుంది. అటు ఢిల్లీలో పార్టీ ఆఫీసుని ప్రారంభిస్తారు. దాని పేరుని బీఆర్ఎస్ గా మారుస్తారు. మరి రాష్ట్రంలోని పార్టీ ఆఫీసుల పేర్లు కూడా మార్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి త్వరగానే బీఆర్ఎస్ టీంని రెడీ చేయనున్నారు.