ఎడిట్ నోట్: ఎన్నికల ‘సినిమా’.!

-

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ, రాజకీయ రంగాలని వేరు వేరుగా చూడని పరిస్తితి. రెండు రంగాలు దాదాపు కలిసినట్లే ఉంటాయి. ప్రధానంగా సినీ రంగంలో ఉన్నవారు..రాజకీయ రంగంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే దివంగత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి సీఎం అయ్యారో..ఆయన బాటలో చాలామంది సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చారు. అందులో కొంతమంది సక్సెస్ అయ్యారు. కొంతమంది ఫెయిల్ అయ్యారు.

ఇప్పటికీ రెండు రాష్ట్రాల రాజకీయాల్లో సినీ నటులు ఉన్నారు. అయితే ఏపీతో పోలిస్తే తెలంగాణలో సినీ నటులు రాజకీయాల్లో ఉండటం కాస్త తక్కువే అని చెప్పాలి. ఇప్పుడుప్పుడే అక్కడ కూడా నటులు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇక తెలంగాణలో మొదట నుంచి రాజకీయాల్లో ఉన్న నటుడు బాబూమోహన్..ఈయన 90ల కాలంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. టి‌డి‌పి ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టి‌డి‌పిని వదిలి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చి ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు బి‌జే‌పిలో ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఆయన బి‌జే‌పి నుంచి బరిలో దిగనున్నారు. ఇక విజయశాంతి సైతం రాజకీయాల్లో ఎప్పటినుంచో ఉన్నారు. ఆమె ప్రస్తుతం బి‌జే‌పిలో ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి చూస్తున్నారు. జీవిత రాజశేఖర్ సైతం బి‌జే‌పిలో ఉన్నారు. జీవిత సైతం సీటు ఆశిస్తున్నారు. హీరో నితిన్‌ని బి‌జే‌పి వైపు తీసుకునేందుకు చూస్తున్నారు. ఆయన్ని పోటీ చేయించాలని చూస్తున్నారు..కానీ నితిన్ ఇప్పటిలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు.

ఇక డైరక్టర్ ఎన్ శంకర్..బి‌ఆర్‌ఎస్ పార్టీలో సీటు ఆశిస్తున్నారు. 2014 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీ..శంకర్ కు సీటు ఆఫర్ చేసింది గాని..అప్పుడు ఆయన పోటీకి ఆసక్తి చూపలేదు. ఇప్పుడు పోటీకి రెడీగా ఉన్నారు. అలాగే నిర్మాత దిల్ రాజు, నటుడు ప్రకాష్ రాజ్ సైతం బి‌ఆర్‌ఎస్ లో సీటు ఆశిస్తున్నారని తెలుస్తోంది. అటు కాంగ్రెస్ లో కత్తి కార్తీక సీటు ఆశిస్తున్నారు. ఇలా ఎన్నికల బరిలో దిగడానికి సినీ నటులు రెడీగా ఉన్నారు. మరి ఈ సారి ఎవరికి ఛాన్స్ దక్కుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news