ఎడిట్ నోట్: కేసీఆర్ ఎన్నికల ‘అస్త్రాలు’.!

-

ఎన్నికల సమయంలో ఎలా మాట్లాడితే..ఏ విధంగా ప్రజలు ఆకర్షితులు అవుతారో..ఎలాంటి వరాలు కురిపిస్తే ప్రజా మద్ధతు పెరిగి..మళ్ళీ ఓట్లు భారీగా పడి గెలవడానికి ఛాన్స్ ఉంటుందో..అన్నిరకాలుగా కే‌సి‌ఆర్ రాజకీయ వ్యూహాలు రెడీ చేసేశారు. మరో మూడు నెలల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్ళీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి, అటు బి‌జే‌పికి చెక్ పెట్టి అధికారం దక్కించుకోవాలని కే‌సి‌ఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

అయితే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి బి‌ఆర్‌ఎస్ సులువుగా గెలవడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కే‌సి‌ఆర్ అలెర్ట్ అయ్యారు. ఇక తనదైన శైలిలో మాటల మాంత్రికుడు మాదిరిగా ముందుకు దూసుకెళుతున్నారు. తాజాగా అసెంబ్లీలో సుదీర్ఘంగా ప్రసాగించి అదరగొట్టేశారు. ఆ స్పీచ్ మొత్తం ఎన్నికలకు సంబంధించి ఉంటుంది. ప్రతిపక్షాలని టార్గెట్ చేయడం, అలాగే చేసిన అభివృద్ధి పనులు చెప్పడం, ప్రజలపై వరాలు కురిపించడం.ఇలా ప్రతి అంశం ఎన్నికల అస్త్రాలుగానే ఉంది. మొదట ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయడం..ఇది పూర్తిగా ఎన్నికలకు ఉపయోగపడేది.

అలాగే కొన్ని కొత్త పథకాలకు శ్రీకారం చుడతామని అంటున్నారు.  ఖమ్మం సభలో కాంగ్రెస్ పెన్షన్ 4 వేలు ప్రకటించిందని, తాము 5 వేలు అంటామని అంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో గంపెడు అస్త్రాలున్నాయని, సమయం వచ్చినప్పుడు బయటకు తీస్తామని చెప్పారు. అవసరమైతే పెన్షన్లు పెంచుతామని, తాము చేయగలిందే చెబుతామని అన్నారు.

ఎక్కువ శాతం కాంగ్రెస్‌ని టార్గెట్ చేశారు. మధ్య మధ్యలో బి‌జే‌పిపై విరుచుకుపడ్డారు. ఇలా రెండు పార్టీలని నెగిటివ్ చేయడానికే చూశారు. ఇక అనూహ్యంగా ఏపీ సి‌ఎం జగన్‌ని పొగిడారు. వైఎస్‌ చనిపోయాక జగన్‌ను కాంగ్రెస్‌ రాంగ్‌గా హ్యాండిల్‌ చేసిందని, దాంతో ఏపీలో జగన్ కొత్త పార్టీ సత్తా చాటారని, అక్కడ ఏపీ కథ ముగిసిందని,  ఆ కారణంతోనే తెలంగాణలోనైనా పది సీట్లు రాకపోతాయా అన్న తెలంగాణ ఇచ్చారని చెప్పుకొచ్చారు.

ఇటు ఎంఐఎం తమకు ఫ్రెండ్లీ పార్టీ అని, భవిష్యత్‌లోనూ తమ స్నేహం కొనసాగుతుందని చెప్పారు. అంటే అటు జగన్, ఇటు ఎం‌ఐ‌ఎంలని మిత్రులుగా చేసుకున్నారు. తెలంగాణలో వైఎస్సార్‌ని అభిమానించే వారు ఉన్నారు. వారి ఓట్ల కోసం జగన్‌తో, ఇటు ముస్లిం మైనారిటీల ఓట్ల కోసం ఎం‌ఐ‌ఎంతో స్నేహం అంటున్నారు. మొత్తానికి కే‌సి‌ఆర్ ఎన్నికల అస్త్రాలు మామూలుగా లేవు.

Read more RELATED
Recommended to you

Latest news