తెలంగాణ వాకిట టీడీపీ లేదు
ఆ మాటకు వస్తే టీడీపీ ఓటు బ్యాంకు
అటు కాంగ్రెస్ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ
పంచుకోవాలి.. అందుకు తగ్గ విధంగా
ఏదో ఒక ఆకర్షణ మంత్రం పఠించాలి
ఆ విధంగా నిన్నటి వేళ తారక మంత్రం జపించారు
నందమూరి తారక రామారావుకు నివాళి అర్పించి
ఇరు రాష్ట్రాలలోనూ చర్చనీయాంశం అయ్యారు
తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దలు.
ఆత్మగౌరవం అన్న నినాదం వినిపించిన ప్రతిసారీ తెలుగుదేశం పార్టీ గురించి, నాటి ఆవిర్భావ వేళా విశేషం గురించి ఏదో ఒక అభిప్రాయం వినిపిస్తూనే ఉంటుంది.ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఆ పార్టీ బాటలో నడిచి మరికొందరు పార్టీలు ప్రారంభించారు. సొంతంగా తమకంటూ ఓ ప్రాభావాన్ని పెంచుకుంటూనే ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకున్నారు. ఆ క్రమంలోనే చంద్రశేఖర్ రావు ఆ రోజు సొంతంగా ఓ పార్టీ ప్రారంభించి, ఇవాళ తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇవాళ నిలదొక్కుకున్న నేతలంగా ఆయన ప్రాభవంతో పేరు తెచ్చుకున్నవారే ! ఆ విధంగా ఎన్టీఆర్ అనే పెద్ద వ్యక్తికి కేసీఆర్ అభిమాని అయ్యారు. కేసీఆర్ అనే అధినేతకు అండగా నిలిచి, మరికొందరు అనుచరులు ఆయన్ను తిరుగులేని రాజకీయశక్తిగా మార్చారు.ఇవాళ అక్కడ ఉన్న నేతలంతా మా నేతలే ! కనుక రాజకీయాలకు జోలికి పోను కానీ అంటూనే నిన్నటి వేళ చింతమనేని ఆసక్తిదాయక వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో గొప్ప మార్పులు రావు కానీ గొప్ప మాటలు మాత్రం వినిపిస్తాయి. ఒకప్పుడు ఇక్కడి నుంచి వెళ్లి ఎదిగిన నాయకులు టీఆర్ఎస్ నాయకులు అని టీడీపీ ఎప్పుడూ అంటుంటోంది. అదే మాట ఈ సారి కూడా అంటోంది. వినిపిస్తోంది.ఆశ్చర్యపోవడం కన్నా ఇలాంటి వ్యాఖ్యలపై ఇంకొంత లోతుగా విశ్లేషించడం ఓ బాధ్యత. ఎందుకంటే ఆరోజు చంద్రశేఖర్ రావు కానీ నామా నాగేశ్వరరావు కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ ఇలా చాలా మంది లీడర్లు ఇక్కడి నుంచి ఎదిగి వెళ్లిన వారే. ఆఖరికి మంత్రి మల్లా రెడ్డి కూడా ఇక్కడి నుంచి ఎదిగిన వారే! కాల గతిలో టీడీపీ అక్కడ ప్రాభవం కోల్పోతూ వస్తున్నందు వల్ల పసుపు పార్టీ నాయకులంతా ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు.
ఇంకా చెప్పాలంటే..
ఇరు రాష్ట్రాల పెన్నిధి ఎన్టీఆర్
నిన్నటి వేళ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఆరంభం అయ్యాయి. రాజకీయం మళ్లీ ఆసక్తిదాయకంగా వినిపిస్తోంది. అటు తెలుగుదేశం పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా పెద్దాయనకు నివాళులు అర్పించింది. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆసక్తిదాయక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు భారత రత్న దక్కేందుకు పార్లమెంట్ లో పోరాడతామని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. తెలుగు వారి ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసిన మహనీయుడు ఆయన అని అన్నారు.
ఇదే సందర్భంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చింతమనేని ప్రభాకర్ కూడా ఆసక్తిదాయక వ్యాఖ్యలు చేశారు.టీఆర్ఎస్ అంటే టీడీపీ అని నవ్వుతూ వ్యాఖ్యలు చేశారు. మహానాడుకు విచ్చేసిన ఆయన ఈ వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు. అక్కడున్న వారంతా తమ వారేనని, గతంలో ఎన్టీఆర్ జయంతి చేయకపోయినా ఈ సారి చేశారు కదా! అంటే తమకు రాజకీయ జీవితం ఇచ్చిన మహానేతకు కృతజ్ఞతగా వారు నివాళి అర్పించి ఉంటారు. తప్పేం లేదు. ఎన్టీఆర్ ఓ ప్రాంతానికి చెందిన నేత అని అనుకోలేం. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకూ చెందిన నేత అని చింతమనేని వ్యాఖ్యానించారు.