రాబోయే రెండు, మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. మరో రెండు, మూడు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. ఇదే సమయంలో అరేబియన్ సముద్రం, లక్షద్వీప్‌లోని పలు ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు ప్రవేశించనున్నాయి.
జన్ 5-10 తేదీల మధ్యలో నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించనున్నాయి. అయితే ఈ నెల 27వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసినా.. మరో రెండు మూడు రోజులపాటు సమయం పట్టనుంది. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించనున్నాయి. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా దిగువ స్థాయిలో పశ్చిమ గాలులు బలపడి లోతుగా మారాయి. ఉపగ్రహాల చిత్రాల ప్రకారం.. కేరళ తీరం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రంపై ఆకాశం మేఘావృతమై కనిపిస్తోంది.