ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు..ఒకే వేదిక నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చేశారని చెప్పవచ్చు. త్వరలోనే ఆయన ఏపీలో బస్సు యాత్రకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో వారాహి బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఏపీలో పొత్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎప్పటిలాగానే ఓట్లని చీలనివ్వను అని చెబుతూనే.. ఏపీలో ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు ఉందని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసే వెళ్తామని, కాదంటే ఒంటరిగానైనా వెళ్తామని, లేదా కొత్త పొత్తులు కలిస్తే వారితో కలిసి వెళ్తామని చెప్పుకొచ్చారు. అంటే బీజేపీ కలిసొస్తే పర్లేదు..లేదంటే టీడీపీతో కలిసి ముందుకెళ్తారు.అది కుదరని పక్షంలో ఒంటరిగానైనా ముందుకెళ్తామని పవన్ చెబుతున్నారు. అయితే ఇక్కడ టిడిపి సైతం జనసేనతో కలవడానికి రెడీగా ఉంది. కానీ టీడీపీతో పొత్తు పెట్టుకోమని బిజేపి అంటుంది..అప్పుడు పవన్ బీజేపీని వదిలేస్తారా? లేక టీడీపీతో పొత్తు వద్దు అనుకుంటారా? అనేది అర్ధం కాకుండా ఉంది. అటు బలవంతపు పొత్తులు అవసరం లేదని బిజేపి నేత జివిఎల్ నరసింహారావు అంటున్నారు. పైగా జనసేనతో పొత్తు కొనసాగుతుందని, వైసీపీ-టీడీపీలతో పొత్తు ఉండదని చెప్పుకొస్తున్నారు. మరి అలాంటప్పుడు టీడీపీతో పొత్తు విషయాన్ని పవన్ ఎలా తేలుస్తారనేది క్లారిటీ లేదు.
సరే ఏపీ విషయం పక్కన పెడితే..తెలంగాణపై కూడా పవన్ ఫోకస్ పెట్టారు. ఇక్కడ ఎవరైనా పొత్తు కోసం ముందుకొస్తే రెడీ అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. కనీసం 10 మంది జనసేన ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో ఉండాలని తెలంగాణ జనసేన నేతలకు సూచించారు. అదేవిధంగా 7 నుంచి 14 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు.
అయితే తెలంగాణలో బీజేపీ మాత్రం జనసేనతో పొత్తుకు రెడీగా ఉన్నట్లు లేదు. పోనీ ఇక్కడ టీడీపీ ఏమైనా జనసేనతో కలవడానికి రెడీగా ఉంటుందనేది చూడాలి. అయినా సరే తెలంగాణలో జనసేనకు గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి. టీడీపీ-జనసేన తెలంగాణలో కలిస్తే కొన్ని సీట్లలో గెలుపోటములని ప్రభావితం చేయవచ్చు. దాని వల్ల బిఆర్ఎస్ లేదా బిజేపిల్లో ఎవరికొకరికి నష్టం జరిగే ఛాన్స్ ఉంది. మొత్తానికి పవన్ రాజకీయం వేరుగా ఉంది.