ఎడిట్ నోట్: పొంగులేటి-జూపల్లి పాలిటిక్స్.!

-

తెలంగాణ రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు..ఈ ఇద్దరు పెద్ద హాట్ టాపిక్ అయ్యారు. బి‌ఆర్‌ఎస్ లో ప్రాధాన్యత లేక..ఆ పార్టీ నుంచి బయటకొచ్చి సొంతంగా రాజకీయం చేస్తున్న ఈ ఇద్దరు నేతల కోసం అటు బి‌జే‌పి, ఇటు కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరికి వారు వారిద్దరిని పార్టీలోకి లాగాలని చూస్తున్నారు. కానీ ఈ ఇద్దరు నేతలు ఏ పార్టీలోకి వెళ్తారో మాత్రం తేల్చడం లేదు. ఇద్దరు నేతలు చాలా వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు.

ఎందుకంటే రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. అందుకే ఆ ఇద్దరు నేతలు ఆచి తూచి అడుగులేస్తున్నారు. తొందరపడి ఏ పార్టీలోనూ చేరాలని చూడటం లేదు. అలాగే రెండు పార్టీల నేతలు వచ్చి కలిసి తమ తమ పార్టీలోకి రావాలని కోరుతున్నా కూడా..తొందరపడి మాట ఇవ్వడం లేదు. దీని బట్టి చూస్తే ఆ ఇద్దరి రాజకీయమే వేరుగా ఉంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు బలమైన నాయకులే. పొంగులేటికి ఖమ్మంలో పట్టు ఉంటే..జూపల్లికి మహబూబ్‌నగర్ లో పట్టు ఉంది. అందుకే ఈ ఇద్దరు నేతల కోసం రెండు పార్టీలు గట్టిగా ట్రై చేస్తున్నాయి.

ఇప్పటికే ఈ ఇద్దరు నేతలతో కొందరు కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరిపారు. కానీ వారు అటు వస్తామని హామీ ఇవ్వలేదు. తాజాగా బి‌జే‌పి చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో పలువురు బి‌జే‌పి నేతలు..ఈ ఇద్దరితో చర్చించారు. అయితే వీరికి కూడా బి‌జే‌పిలోకి వస్తామని హామీ ఇవ్వలేదు. అంటే పార్టీలో చేరికపై స్పష్టత ఇవ్వలేదు. కానీ కే‌సి‌ఆర్‌ని ఓడించడం తమ ధ్యేయం అంటున్నారు. అంటే ఈ ఇద్దరు కర్నాటక ఎన్నికల్లో వచ్చే ఫలితాలు బట్టి రాజకీయంగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అక్కడ బి‌జే‌పి గెలిస్తే..అటు వైపు వెళ్లవచ్చు..కాంగ్రెస్ గెలిస్తే ఆచి తూచి ముందు అడుగులు వేయవచ్చు. చూడాలి మరి పొంగులేటి, జూపల్లి రాజకీయం రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version