ఎడిట్ నోట్: రేవంత్‌కు ఎండ్ కార్డు..?

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు పైచేయి సాధిస్తున్నారా? రేవంత్ రెడ్డి పి‌సి‌సి పదవి నుంచి తప్పుకోనున్నారా?అంటే ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలని చూస్తే కాస్త అవుననే అనిపిస్తుంది. ఎప్పుడైతే రేవంత్ పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యారో..అప్పటినుంచి కొందరు సీనియర్లు రేవంత్‌కు వ్యతిరేకంగా గళం వినిపిస్తూ వస్తున్నారు. కొందరు నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల పదవుల పంపకాలపై పెద్ద రచ్చ జరిగింది.

టీడీపీ నుంచి వచ్చిన వారికే ఎక్కువ శాతం పదవులు ఇచ్చారని ఉత్తమ్, భట్టి లాంటి వారు ఆరోపించారు. దీంతో టీడీపీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలు..తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇదే క్రమంలో అధిష్టానం ఆదేశాలతో రాష్ట్రనికి వచ్చిన దిగ్విజయ్ సింగ్ పార్టీలోని సమస్యలని పరిష్కరించడానికి చూశారు. ఇక మెజారిటీ సీనియర్ నేతలు ..పి‌సి‌సి అధ్యక్ష పదవి నుంచి రేవంత్‌ని, రాష్ట్ర ఇంచార్జ్ పదవి నుంచి మాణిక్కం ఠాగూర్‌ని తప్పించాలని ఫిర్యాదులు చేశారు. ఇక ఈ ఫిర్యాదులని దిగ్విజయ్..ఇటీవల అధిష్టానానికి వివరించారు.

ఇదే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఊహించని నిర్ణయం తీసుకుంది.  కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతల నుంచి మాణిక్కం ఠాగూర్‌ను పార్టీ అధిష్ఠానం తప్పించింది. ఆ స్థానంలో మహారాష్ట్ర పీసీసీ మాజీ చీఫ్‌ మాణిక్‌రావు ఠాక్రేను నియమించింది. ఇక ఠాగూర్‌కు గోవా రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించింది. అయితే ఇంతకాలం ఠాగూర్..రేవంత్‌కు మద్ధతుగా ఉంటున్నారనే విమర్శలు చేశారు. ఇప్పుడు ఠాగూర్ సైడ్ అయ్యారు.

ఇదే సమయంలో రేవంత్ రెడ్డి సైతం ఊహించని విధంగా కామెంట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు తానే అడ్డు అనుకుంటే.. తన పదవినే కాకుండా ప్రాణత్యాగం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని, పార్టీకి ఉపయోగపడుతుందనుకుంటే తన పదవిలో ఏ నాయకుడిని కూర్చోబెట్టినా.. భుజంపై పల్లకిలా మోసే బాధ్యత తీసుకుంటానని రేవంత్ చెప్పుకొచ్చారు. ఇదేదో తాను మాట వరుసకు చెబుతున్నది కాదన క్లారిటీ ఇచ్చారు.

రేవంత్ మాటలు బట్టి చూస్తే…పి‌సి‌సి పదవిలో కూడా మార్పు ఉంటుందేమో అనే డౌట్ తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తుంది. అందుకే రేవంత్ ముందే పదవి నుంచి  తప్పుకోవడానికి కూడా రెడీ అని చెబుతున్నారని అంటున్నారు. చూడాలి మరి రేవంత్ పి‌సి‌సి పదవికి ఎండ్ కార్డు పడుతుందేమో.

Read more RELATED
Recommended to you

Latest news