ఎడిట్ నోట్: సర్వేలు..పొత్తులు..ఎత్తులు..!

-

మొత్తానికి తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. ఎప్పుడైతే కే‌సి‌ఆర్..తమ పార్టీ తరుపున 115 మంది అభ్యర్ధులని ప్రకటించారో అప్పటినుంచి ఎన్నికల హడావిడి మొదలైంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కొత్తగా పోటీ చేసే అభ్యర్ధులు ఫీజులు కట్టి గాంధీ భవన్‌లో అప్ప్లై చేసుకోవాలని రూల్ పెట్టారు. దీనికి భారీగానే స్పందన వచ్చింది. 119 స్థానాలు ఉంటే వెయ్యి మంది వరకు సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఇక అటు బి‌జే‌పి సైతం అభ్యర్ధుల ఎంపికపై ఆచి తూచి ముందుకెళుతుంది.తమకు పట్టున్న స్థానాల్లో సత్తా చాటాలని చూస్తుంది. ఎన్నికల సమయం దగ్గరపడటంతో సర్వేల సందడి మొదలైంది. పెద్ద ఎత్తున సర్వేలు కొనసాగుతున్నాయి. ఎవరికి అనుకూలమైన సర్వేలు వారికి వస్తున్నాయి. కొన్ని సర్వేలు బి‌ఆర్‌ఎస్ పార్టీదే మళ్ళీ అధికారమని చెబుతుంటే..కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అధికారమని, హాంగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. బి‌జే‌పికి మాత్రం మూడో స్థానమే అని అన్నీ సర్వేల్లో తేలింది. దీని బట్టి చూస్తే బి‌జే‌పి రేసులో లేదనే చెప్పవచ్చు.

ఎన్నికల నేపథ్యంలో పొత్తుల అంశం కూడా కీలకంగా మారింది. మునుగోడు ఉపఎన్నికలో సి‌పి‌ఐ, సి‌పి‌ఎంలతో కలిసి పోటీ చేసిన బి‌ఆర్‌ఎస్ పార్టీ..ఇప్పుడు ఆ పార్టీలని పక్కన పెట్టేసింది. కే‌సి‌ఆర్ కమ్యూనిస్టులని పక్కన పెట్టడంతో..వారు ఇప్పుడు కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు చూస్తున్నాయి. చెరోక రెండు సీట్లు సి‌పి‌ఐ, సి‌పి‌ఎంలు అడుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ ఏమో చెరోక సీటు..ఒక ఎమ్మెల్సీ ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది.

అయితే వీరు చర్చల్లో కూర్చుంటేనే..పొత్తులు తేలనున్నాయి. అటు ఎన్నికల్లో గెలిచేందుకు ఎవరి ఎత్తులు వారికి ఉన్నాయి. జంపింగులు కొనసాగుతున్నాయి. మేనిఫెస్టో అంశంలో దూకుడుగా ఉన్నాయి. బి‌ఆర్‌ఎస్ ఎలాగో అధికారంలో ఉంది కాబట్టి..అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ బి‌ఆర్‌ఎస్‌కు మద్ధతు తెలపాలని చెబుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున హామీలు ఇస్తూ ముందుకెళుతుంది. ఇంకా బి‌జే‌పి మాత్రం మేనిఫెస్టో విషయంలో వెనుకబడి ఉంది. మొత్తానికి బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోరు రసవత్తరంగా జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news