ఎడిట్ నోట్: కవిత వర్సెస్ కమలం..పోలిటికల్ గేమ్!

-

తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రమైంది. దీనికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక కారణమైంది. గత కొన్ని రోజులుగా లిక్కర్ స్కామ్ లో సంచలన అరెస్టులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ కుమార్తె కవిత పేరు కూడా లిక్కర్ స్కామ్ లో వినిపిస్తుంది. అలాగే ఆమె పేరు ఈడీ రిపోర్టులో వచ్చింది. సి‌బి‌ఐ సైతం ఒకసారి కవితని విచారణ చేసింది. ఇప్పుడు ఈడీ విచారణ చేయడానికి రెడీ అవుతుంది.

ఇదే తరుణంలో ఈడీ విచారణ కంటే ముందు కే‌సి‌ఆర్..కవితతో పోలిటికల్ గేమ్ కు తెరలేపారు. ఢిల్లీ వేదికగా మహిళా రిజర్వేషన్లు అంటూ రాజకీయం మొదలుపెట్టారు. ఇప్పటికే కవిత ఢిల్లీకి వెళ్ళిన విషయం తెలిసిందే. దేశంలోని ప్రతిపక్షాలకు చెందిన మహిళా నేతలతో జంతర్ మంతర్ వద్ద ఒక్క రోజు దీక్ష చేయనున్నారు.  మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది.

ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవితే దగ్గరుండి చూస్తున్నారు. ఈ దీక్షకు సంఘీభావంగా దేశంలోని 18 పార్టీలకు చెందిన నేతలు, ఆయా పార్టీల బృందాలు పాల్గొననున్నాయి. ఆ తర్వాత రోజు ఢిల్లీలో కవితని లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారించనుంది. ఈ క్రమంలో ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరిగింది.

అయితే ఢిల్లీలో కవిత దీక్షకు దిగనున్న నేపథ్యంలో తెలంగాణలో బి‌జే‌పి ఆధ్వర్యంలో మహిళా నేతలతో దీక్ష జరగనుంది. రాష్ట్రంలోని బెల్టు షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ బీజేపీ మోర్చ నేతలు దీక్ష చేయనున్నారు. ఈ నిరసన దీక్షలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, విజయశాంతితో పాటు పలువురు మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. అంటే కవితకు పోటీగా బి‌జే‌పి మహిళా నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇలా దీక్షలతో అటు ఢిల్లీ, ఇటు తెలంగాణలో రాజకీయ యుద్ధం తీవ్రం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news