తెలంగాణ రాజకీయాల్లో ఎన్నో ట్విస్టులు, షాకుల ఈటల రాజేందర్ వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. అందరూ ఊహించిన విధంగానే ఈ రోజు ఆయన తన పార్టీ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్‌పై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అలాగే హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేయనున్నారు ఈటల.
దీంతో ఇప్పడు ఆ పదవి కాస్తా ఖాళీ అయింది. దాదాపు 81 ఏళ్ల హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ చరిత్రలో ఆ అధ్యక్ష పదవికి పదవీకాలం ముగియకుండానే ఓ అధ్యక్షుడు రాజీనామా చేయడం ఇదే తొలిసారి. ఈటల రాజేందర్ ఇందులో ప్రథముడు.
దీంతో ప్రతిష్ఠాత్మకమైన ఆ పదవి ఖాళీ అయింది. అయితే ఆ కుర్చీ కోసం వర్గ బేధాలు రాకుండా చూసేందుకు అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి ఈటల స్థానంలో మంత్రి కేటీఆర్‌ను అధ్యక్షునిగా నియమించాలని మెజార్టీ సొసైటీ సభ్యులు తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. వారిని టీఆర్ ఎస్ అధిష్టానం ఒప్పించి మరీ ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని సమాచారం. దీంతో కేటీఆర్‌కు లైన్ క్లియర్ అయిందని, టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.