ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ ఆ సంస్థలో పెను మార్పులు తీసుకువస్తున్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారిని తొలగించడం నుంచి ట్విటర్ గైడ్లైన్సులో మార్పుల వరకు మస్క్ చేస్తోన్న ప్రతీది సెన్సేషనే క్రియేట్ చేస్తోంది. అయితే నష్టాల్లో ఉన్న కంపెనీని గట్టెక్కించేందుకు ఇప్పటికే మస్క్ చాలా మంది ఉద్యోగులను తొలగించారు. ఇప్పుడు ఏకంగా రెండు కార్యాలయాలకు తాళమేశారు.
భారత్‌లో ఖర్చులు తగ్గించాలన్న ఉద్దేశంతో గతేడాది ట్విటర్ ఇండియా నుంచి 90 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కంపెనీకి సంబంధించి ఇండియాలో ఉన్న మూడు కార్యాలయాల్లో దిల్లీ, ముంబయిల్లో ఉన్న రెండింటిని మూసివేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం కేవలం బెంగుళూరులో ఉన్న ఆఫీసు నుంచి మాత్రమే ట్విటర్ తన కార్యకలాపాల్ని కొనసాగిస్తోంది. అక్కడ ఎక్కువ శాతం మంది ఇంజినీర్లు ఉన్నట్లు తెలుస్తోంది.