హుజూరాబాద్ ఉపఎన్నిక పోరులో టిఆర్‌ఎస్-బిజేపి పార్టీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. పేరుకే పార్టీలు గానీ ఇక్కడ ప్రధాన పోటీ కేసిఆర్-ఈటల మధ్యే ఉందని అర్ధమవుతుంది. ఇద్దరు నాయకులు హుజూరాబాద్‌లో గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ఇద్దరు నాయకులు అదిరిపోయే వ్యూహాలు రచిస్తూ ముందుకెళుతున్నారు.
అసలు కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఉపఎన్నికపై ఫోకస్ చేసినట్లు లేదు. ఇప్పటికీ ఆ పార్టీ అభ్యర్ధిని ప్రకటించలేదు. అటు రేవంత్ రెడ్డి సైతం హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి పెద్దగా మాట్లాడటం లేదు. దీంతోనే హుజూరాబాద్ విషయంలో కాంగ్రెస్ లైట్ తీసుకుందని అర్ధమవుతుంది. అదే సమయంలో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ గెలవదని ఫిక్స్ అయిన రేవంత్, పరోక్షంగా ఈటల గెలవడానికి కృషి చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
ఇక్కడ కేసిఆర్ ఓడిపోవడం రేవంత్‌కు కావాలని, అలా అని కాంగ్రెస్ గెలవాలని రేవంత్ కోరుకుంటున్నట్లు కనబడటం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ని వీడి టిఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి, రేవంత్-ఈటలని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారని, తనకు సహకరించాలని ఈటల..రేవంత్ రెడ్డిని కోరారని.. ఇద్దరూ కుమ్మక్కయ్యారని కౌశిక్ మాట్లాడుతున్నారు.
రేవంత్ రెడ్డికి ఈటల ప్యాకేజీ ఇచ్చారని , అందుకే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఊసే లేకుండా పోయిందని అన్నారు. అంటే రేవంత్ హుజూరాబాద్ ఉపఎన్నికని లైట్ తీసుకోవడం వల్ల, ఈటలతో కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలు ఎదురుకోవాల్సి వచ్చింది. కౌశిక్ విమర్శలకు తగ్గట్టుగానే…రేవంత్ హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ని లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పోటీలో ఉంటే ఎంతోకొంత ఓట్లు చీలిపోయి, దాని వల్ల ఈటలకు డ్యామేజ్ జరిగి, తమకు లాభం జరుగుతుందని టిఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇక టిఆర్‌ఎస్ నేతల ఆశలకు రేవంత్ గండికొట్టడంతో కౌశిక్ ఇలా విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికైతే హుజూరాబాద్‌లో రాజకీయాలు చాలా మలుపులు తిరిగేలా కనిపిస్తున్నాయి.