మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. దళితులను వంచించి అధికారంలోకి వచ్చిన చరిత్ర కేసీఆర్ దని విమర్శించారు ఈటల రాజేందర్. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానన్నాడని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్నాడని, కానీ అవన్నీ వట్టిమాటలుగానే మిగిలిపోయాయని అన్నారు ఈటల రాజేందర్. కేసీఆర్ చాంబర్ లో ఒక్క దళిత అధికారి కూడా లేరని ఈటల రాజేందర్ తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకే దళితబంధు ఇస్తున్నారని ఈటల ఆరోపించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంతోనే కేసీఆర్ పతనం మొదలైందని అన్నారు. సామాన్యులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు ఈటల రాజేందర్. రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్, అధికారంలోకి వచ్చాక అణచివేస్తున్నారని ఈటల మండిపడ్డారు.
మాయమాటలు చెప్పి ఓట్లు పొందారని, ఇప్పుడదే మోడల్ ను దేశమంతా వర్తింపజేస్తావా? అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం చూస్తుంటే, కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టుందని ఎద్దేవా చేశారు.